కేంద్ర ప్రభుత్వం బుధవారం తీసుకువచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమర్థించారు. ఇది దేశంలో రాజకీయ అవినీతిని అంతం చేస్తుందన్నారు. అయితే.. ఈ బిల్లుపై విపక్షాలు నిరసన, ఆందోళన వ్యక్తం చేస్తుండడాన్ని ప్రధాని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న సగం మంది నేతలు.. బెయిళ్లపై ఉన్నారంటూ.. లాలూ ప్రసాద్ యాదవ్ సహా మరికొందరి పేర్లు చెప్పుకొచ్చారు. “అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారు.. అదే అవినీతిలో కూరుకుపోయి.. నీతులు ఎలా చెబుతారు? అందుకే ఈ బిల్లు తీసుకువచ్చాం.“ అని ప్రధాని ఉద్ఘాటించారు.
బీహార్‌లో శుక్రవారం పర్యటించిన ప్రధాన మంత్రి.. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.(మరో 2 మాసాల్లోనే ఎన్నికలు జరగను న్నాయి.) అనంతరం నిర్వహించిన సభలో మోడీ మాట్లాడుతూ.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తావించారు. ఈ బిల్లు ద్వారా ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు.. తీవ్ర నేరాల్లో చిక్కుకుని 30 రోజుల వరకు జైళ్లలో ఉంటే.. 31వ రోజు వారి పదవులు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రెండురోజులు.. నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ బిల్లును ప్రధాని పూర్తిగా సమర్థించారు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్టయి.. 50 గంటల పాటు జైల్లో ఉంటే అతనిఉద్యోగం పోతోందని గుర్తు చేసిన మోడీ.. అలాంటప్పుడు ప్రజలకు సేవ చేసేవారు ఇంకెంత నిబద్ధతతో ఉండాలో ఆలోచించాలని కోరారు. బీహార్ విపక్షం ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉంటే జైలు.. లేకపోతే బెయిలు అన్నట్టుగా ఉన్నారని.. అందుకే వారు భయపడుతున్నారని వ్యాఖ్యానించా రు. ఈసందర్భంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పేరు ఎత్తకుండా ఆయనను దుయ్యబట్టా రు. జైలు నుంచే ఫైళ్లపై సంతకం చేశారని, జైలు నుంచే పాలన చేశారని.. అవినీతికి పాల్పడే నేతలే.. రాజకీయాల్లో ఉంటే.. దేశంలో అవినీతి ఎలా అంతమవుతుందని ప్రధాని ప్రశ్నించారు.
అందుకే, ఈ బిల్లును తీసుకువచ్చామని ప్రధాని చెప్పారు. క్రిమినల్ నేరాలు చేసిన నాయకులు ప్రజా సేవకుఎలా అర్హులవుతార ని నిలదీశారు. అందుకే తాము ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ఇక, నుంచి అవినీతి నేతలను ప్రజలు కూడా తిరస్కరించా లని ప్రధాని పిలుపునిచ్చారు. “ఇది అవినీతికి వ్యతిరేకం. నేనైనా ఎవరైనా.. సరే.. ఏ స్థాయిలో ఉన్నా కూడా అవినీతికి పాల్పడితే.. పదవుల్లో ఉండేందుకు అర్హులు కాదు. దీనికి ఎవరూ అతీతులు కాకూడదు. విశాల ప్రజా ప్రయోజనమే మాకు మఖ్యం. కొందరికి జైలు ప్రయోజనాలు, బెయిల్ ప్రయోజనాలు ముఖ్యం.“ అంటూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలపై నిప్పులు చెరిగారు.