అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద నేడు రైతుల ఖాతాల్లో నిధులు ప్రభుత్వం జమచేసింది. 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేసింది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు అందించింది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఆ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కుంజారపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.2342.92 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.792.09 కోట్లు రైతులకు అందిస్తున్నారు. పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ కింద మొదటి విడతలో ఆగస్టు నెలలో నెలలో రూ.3174 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రోజు కమలాపురంలో పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొంటారు. పుట్టపర్తి పర్యటన అనంతరం మధ్యాహ్నం కమలాపురం వెళ్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరవుతారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. 10 వేల పైచిలుకు రైతు సేవా కేంద్రాల్లో నిధుల విడుదల కార్యక్రమాన్ని లైవ్ టెలి కాస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. రైతుల ఖాతాల్లో నిధుల విడుదల మాత్రమే కాకుండా…వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సిఎం సూచన చేశారు.
అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం పెంపు, పకృతి సేధ్యం, భూసార పరీక్షలు, పంట ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అధిక ధర వచ్చేలా చేయడం వంటి అంశాలపై రైతాంగానికి అవగాహన కలిగించేలా కార్యక్రమం నిర్వహించనున్నారు.

















