ఏపీ సీఎం చంద్రబాబు కడప జిల్లాలో ఈ నెల 19న పర్యటించ బోతున్నారు ఆ రోజున ఆయన అన్న దాత సుఖీ భవ పేరుతో రైతుల ఖాతాలో రెండో విడత నిధులను విడుదల చేస్తారు. ఆయన ఈ కార్యక్రమం కోసం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖా ముఖీ మాట్లాడుతారు. వారితో అన్ని విషయాలను పంచుకుంటారు. వారి సమస్యలను ఆయన ఆలకిస్తారు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం కూడా కిసాన్ యోజన పధకాన్ని ఇదే సమయంలో విడుదల చేయడంతో కూటమి ప్రభుత్వం ఇదే రోజుని ఎంచుకుంది. ఇక అన్న దాత సుఖీ భవ పథకం కింద ఏకంగా 46 లక్షల మంది రైతులకు ప్రయోజనం సమకూరనుంది. వారు ఖాతాల్లోకి నేరుగా 3 వేల 135 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. అంతే కాదు కేంద్రం అదే రోజు ఇచ్చే రెండు వేల రూపాయతో కలుపుకుని ప్రతీ రైతు కుటుంబానికి ఏడు వేల రూపాయలు అందుతాయన్న మాట.
కూటమి ప్రభుత్వం ఏపీలో వ్యవసాయం అభివృద్ధి చేసే విషయం రైతులకు సాయం చేసే విషయం మీద వారితోనే ముఖ్యమంత్రి చర్చిస్తారు అని అంటున్నారు. ప్రభుత్వం ఏమనుకుంటోంది ప్రభుత్వం ఏ విధంగా ఈ రంగాన్ని చూస్తోంది, ఏ మేరకు ముందుకు తీసుకుని వెళ్ళాలని అనుకుంటోంది వంటి వాటి మీద కూడా రైతులతో ఆలోచనలు బాబు పంచుకుంటారు అని అంటున్నారు.
కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు వివిధ స్థాయిలలోని ప్రజా ప్రతినిధులు అందరూ రైతులకు అన్న దాత సుఖీభవ పధకాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి అందచేసే కార్యక్రమంలో పాల్గొంటారు అని అంటున్నారు. ఇక రైతులకు ప్రభుత్వం చేసే మేలుని వివరిస్తూనే భవిష్యత్తులో వారికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది అన్నది కూడా తెలియచేస్తారు అని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అన్నది రైతు సేవా కేంద్రాల ద్వారా వివరిస్తారు. దాని కోసం పదివేలకు పైగా ఉన్న ఈ కేంద్రాల వద్ద ప్రత్యక్ష ప్రసారం చేస్తారు అని అంటున్నారు. గిరాకీ ఉన్న పంటలు ఏమిటి మార్కెటింగ్ సదుపాయాలు ఎలా లభ్యం అవుతాయి. రైతులు పండించే పంటలకు అదనపు ధర ఎలా కల్పించవచ్చు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షల ప్రాముఖ్యత వంటి అంశాల మీద రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తారు, అవన్నీ వారికి అవగాహన కల్పిస్తారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ సొంత జిల్లాలో సీఎం ఈ నెల 19న నిర్వహించే కార్యక్రమం మీద అందరి దృష్టి ఉంది.


















