సరిగా పనిచేయని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు పార్టీ తరఫున నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆదేశించారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్న అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న 48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇక అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్.. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ నిర్వహించాలని సూచనలు చేశారు.
దీంతో ఎమ్మెల్యేల్లో కొంతవరకు మార్పు వచ్చినా, మరికొందరు యథావిధిగా నిర్లక్ష్యంగా ఉన్నారని పార్టీ అధిష్టానికి సమాచారం అందింది. దీంతో తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్.. తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగా పనిచేయని 25 మందికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ 25 మందిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి లోకేశ్ ఆగ్రహానికి గురైన ఆ 25 మంది పేర్లు బయటకు రాకపోయినా, ఈ జాబితాలో పేర్లు ఉంటున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయని మాత్రం అంటున్నారు.
నియోజకవర్గాల్లో తామే సుప్రీం అనుకుంటున్న ఎమ్మెల్యేలు.. పార్టీని కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని అధినేత, యువనేత ఆగ్రహంగా ఉంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలంటే కార్యకర్తలు, పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఇద్దరు ముఖ్యనేతల ఆలోచనగా చెబుతున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా, తమ తీరు మార్చుకోవడం లేదని, పార్టీని వెనక్కి నెట్టి తమ సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి లోకేశ్ అసంతృప్తి చెందుతున్నారని అంటున్నారు. తాజాగా జోనల్ ఇంచార్జిల సమావేశంలో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారని అంటున్నారు.
టీడీపీలో సభ్యత్వంతోపాటు బీమా కూడా కార్యకర్తలకు చేయిస్తున్నారు. ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం పార్టీ ప్రాధమిక కర్తవ్యంగా లోకేశ్ భావిస్తున్నారు. దీనివల్ల కార్యకర్తల కుటుంబాలకు భరోసా కలుగుతుందని ఆలోచిస్తున్నారు. ఇక ఇటీవల పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు 600 మంది చనిపోతే అందరికీ రూ.5 లక్షల చొప్పున బీమా డబ్బు మంజూరైంది. అయితే వీరిలో 75 మందికి బీమా మొత్తం ఇప్పటికీ అందజేయలేదు. దీనికి ఆయా ఎమ్మెల్యేలు సమయం కేటాయించకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీకి కార్యకర్తలే అధినేతలు అని.. కార్యకర్తల కష్టంతోనే తాము గెలిచామన్న విషయాన్ని ఎమ్మెల్యేలు విస్మరిస్తే ఎలా అంటూ లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేసి వారి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు.
ఈ విషయం తెలిసి ఇద్దరు మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పని ఒత్తిడి వల్ల కార్యకర్తలకు బీమా చెక్కులు అందజేయలేకపోయామని మౌఖికంగా వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అయితే మంత్రి లోకేస్ సీరియస్ వార్నింగు దృష్టిలో పెట్టుకుని లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు చెబుతున్నారు. కాగా, కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పదవులు రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహ పడొద్దని, అందరికీ న్యాయం చేసే పూచీ తనదని లోకేశ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

















