“మా పవనన్న ఎప్పుడొస్తారో.. మేం ఎప్పుడు చూస్తామో..“ అనే మాట జనసేన పార్టీలో జోరుగా వినిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ జిల్లా , మండలస్థాయిలో పర్యటనల విషయంపై ఎప్పటికప్పు డు.. ప్రకటనలు చేయడం వరకే పరిమితం అవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆయన జిల్లాల పర్యటన వాయిదా పడుతూ వస్తోంది. ఫిబ్రవరిలోనే జిల్లాలకు వస్తానని ఆయన ప్రకటించారు. కానీ.. వెళ్లలేదు. తర్వాత. బడ్జెట్ సమావేశాలతో బిజీగా ఉన్నారన్న సందేశాలు పంపించారు.
తర్వాత.. సెప్టెంబరులో ఖచ్చితంగా ప్రజల మధ్యకు వస్తానని.. పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామ ని చెప్పారు. విశాఖపట్నంలో సెప్టెంబరు తొలివారంలో నిర్వహించిన `సేనతో సేనాని` కార్యక్రమం నిర్వ హించినప్పుడు.. ఈ విషయాన్ని మరింత నొక్కి చెప్పారు. కానీ సెప్టెంబరు.. అక్టోబరు కూడా అయిపోతోంది. ఇప్పటికీ.. పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనపై అదే వాయిదాల పర్వం కోనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సైన్య ఒకింత అసంతృప్తితోనే ఉందని చెప్పాలి.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పార్టీ నాయకత్వం అధ్యయనం చేస్తోంది. త్వరలోనే వస్తారని చెబుతున్నా.. దీనిపై క్లారిటీ లేదు. నిజానికి అక్టోబరు తొలివారంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటిం చాలని భావించారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇంటితోపాటు 100 పడకల ఆసుపత్రి పురోగతిని కూడా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. కానీ, ఈ రెండు కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. మరోవైపు.. ఎమ్మెల్యేలపైనా విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో సేనాని రావాలి.. తమ సమస్యలు చెప్పుకోవాలని సైన్యం ఎదురు చూస్తున్న మాట వాస్తవం.
జనసేనలోనూ చాలా మంది కార్యకర్తలు.. గత ఎన్నికల్లో బాగా కష్టించి పనిచేశారు. పార్టీ విజయం కోసం ప్రయత్నించారు. వారికి తగిన విధంగా గుర్తింపు లభించలేదు. ఎమ్మెల్యేలు కూడా తమకు అందుబాటులో ఉండడం లేదని.. అప్పాయింట్‌మెంటు ఇవ్వడం లేదని.. చాలా నియోజకవర్గాల్లో వినిపిస్తున్న మాట. అంతేకాదు.. ఎంపీలకు.. ఎమ్మెల్యేల కు మధ్య కూడా వివాదాలు నడుస్తున్న మాట వినిపిస్తోంది. ఈ నేప థ్యంలో క్షేత్రస్థాయిలో పవన్ పర్యటిస్తే.. తమ గోడు చెప్పుకోవాలన్నది కార్యకర్తల మాట. మరి పవన్ ఎప్పుడు కరుణిస్తారో చూడాలి.














