వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలు కావడానికి అమరావతి రాజధాని అతి ముఖ్య కారణం అని చెప్పాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటారు. 2014 నుంచి 2019 మధ్యలో విపక్షంలో ఉన్న వైసీపీ అమరావతి రాజధానికి ఓకే చెప్పి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది అన్న నిందను మోసింది. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడింది. విశాఖ నుంచి పాలిస్తామని చెబుతూ అమరావతిని పట్టించుకోలేదు పోనీ అలాగని విశాఖను ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. దాంతో అక్కడా ఇక్కడా అంతా కూడబలుక్కుని మరీ వైసీపీని గద్దె నుంచి దించేశారు.
ఒక వైసీపీ ఓటమి చెందిన తరువాత అమరావతి రాజధాని విషయంలో బాగా తెలిసి వచ్చింది అని అంటున్నారు. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదని అది ప్రజల సెంటిమెంట్ అని కూడా అర్ధం అయింది అని అంటున్నారు. ప్రజలు తమ ప్రాంతాలకు అభివృద్ధి కోరుకోవచ్చు కానీ రాజధానిగా ఏకమొత్తంగా అమరావతికే ఓటేస్తున్నారు అన్నది గ్రహించే లోగానే వైసీపీ చతికిలపడాల్సి వచ్చింది. దాంతో చాలా కాలంగానే వైసీపీ ఆలోచనలలో మార్పు కనిపిస్తోంది.
ఆ మధ్యన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ అమరావతి రాజధానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అని విమర్శించారు తప్ప రాజధాని నిర్మాణం ఏమిటి అని అనలేదు. అంతే కాదు విజయవాడ గుంటూరులను జంట నగరాలుగా చేయవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఒక వెబ్ మీడియా కాంక్లేవ్ లో పాల్గొన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అమరావతి విషయంలో వైసీపీ మారిన విధానాన్ని గట్టిగానే చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పాలిస్తామని చెప్పారు. అంతే కాదు మచిలీపట్నం దాకా ఏకమొత్తంగా రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు వేసి భూములు అప్పగించే ప్రక్రియ కూడా తాము వేగంగా చేపడతామని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా తన తాడేపల్లి నివాసం నుంచే ఉంటూ పాలిస్తారు అని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే అమరావతి విషయంలో వైసీపీకి తత్వం అయితే బోధపడింది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ రానున్న రోజులలో అమరావతి రాజధాని విషయంలో మరింత స్పష్టత ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది అని అంటున్నారు. అమరావతి రాజధానిని తాము అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించబోతోంది అంటున్నారు. ఇక వైసీపీ మారిన వైఖరి చూస్తే అమరావతి రాజధానికి అధికంగా ఖర్చు చేస్తున్నారు అని ఎక్కువ రేట్లకు నిర్మాణాలను ఇస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే కనుక వైసీపీ స్టాండ్ అయితే మూడు రాజధానులు కాదని తేలిపోయింది. మూడు రాజధానులు అంటే జనాలు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉండడంతో వైసీపీ ఇపుడు సంచలన మార్పు దిశగా నిర్ణయాలను తీసుకుంది అని అంటున్నారు. మరి ఇది ప్రజలకు మరింతంగా చేరువ చేయాలని వారి మన్ననలు తిరిగి పొందాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.


















