ఏపీలో తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 12 శుక్రవారం నాటికి పదిహేను నెలలు పరిపూర్తి అయిపోయాయి. మొత్తం అరవై నెలలకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. అయితే అందులో నాలుగవ వంతు కరిగిపోయింది అన్న మాట. ఈ కీలక సమయంలో కూటమి ఏపీలో సాధించిన విజయాలు ఏమిటి ఇబ్బందులు ఏమిటి అన్నది ఒక్కసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయకత్వంలో 2024 జూన్ 12న విజయవాడ వేదికగా మొత్తం 24 మంది మంత్రులతో కూటమి కొలువు తీరింది. ఇందులో ఇరవై మంది టీడీపీకి చెందిన వారు ఉంటే ముగ్గురు జనసేన ఒకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఎక్కువ మంది మంత్రులు కొత్తవారు. ఒక విధంగా చంద్రబాబు తన టోటల్ పొలిటికల్ కెరీర్ లో చేసిన చేసిన కొత్త ప్రయోగంగా దీనిని చూస్తున్నారు.
ఈ పదిహేను నెలల పాలనలో అతి ముఖ్య విషయం ఏమిటి అంటే చంద్రబాబు తాను మారారు. ఎంతలా అంటే చాలా అని చెప్పాలి. గతంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా కాలం పట్టేది. అలాంటిది ఇపుడు రాజకీయంగా అయినా పాలనా పరంగా అయినా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీయే అందుకు ఉదాహరణ. అలాగే సంక్షేమ పధకాల అమలులో కూడా జోరు చూపిస్తున్నారు. మరో వైపు అభివృద్ధి విషయంలో స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. ఇంకో వైపు రేపే మళ్ళీ అన్నికలు అన్నట్లుగా ఏపీ అంతా చుట్టబెడుతున్నారు. గతానికి భిన్నంగా పార్టీ నేతలతో ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం అవుతున్నారు. అలాగే పేదలతో సాధారణ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రతీ నెలా ఒకటవ తేదీన పేద వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అలా తుచ తప్పకుండా 15 నెలలగా చేస్తూ వస్తున్నారు.
గతంలో పొత్తులు కేవలం రాజకీయాల కోసమే అన్న భావన అయితే ఉండేది. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం టీడీపీది అని చెప్పడం లేదు, అందరిదీ అంటున్నారు. జనసేన అధినేత పవన్ కి ఎంతో గౌరవం ఇస్తున్నారు. అలాగే కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కూడా పూర్తి నమ్మకమైన నేస్తంగా ఉంటూ నడచుకుంటున్నారు. కేంద్రం నుంచి ఇతోధికంగా సాయం పొందేందుకు కృషి చేస్తున్నారు.
ఇక అభివృద్ధి అన్నది చూస్తే విత్తనాలు నాటారు, అవి పెరిగి ఫలాలు రావాల్సి ఉంది. అమరావతి పోలవరం ప్రాజెక్టుల విషయంలో డెడ్ లైన్లు విధించి పనులు చేపడుతున్నారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు లక్షల కోట్లలో కుదుర్చుకున్నారు. అవి కూడా ఫలితాలు రావాలంటే ఇంకా సమయం పడుతుంది. అయితే చంద్రబాబు కష్టపడుతున్నారు, అభివృద్ధి చేయాలన్న తపన ఆయనలో ఉంది అన్నది మాత్రం జనాలు అర్ధం చేసుకోవడం కూటమి సాధించిన పెద్ద విజయం అని చెప్పాలి.
ఇక చూస్తే ఏపీలో సూపర్ సిక్స్ పధకాల అమలు మీద చాలా వరకూ సంతృప్తి అయితే ఉంది. కానీ ఇంకా అసంతృప్తులు కూడా ఉన్నాయి. రైతాంగంలో పూర్తి స్థాయిలో 20 వేల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వవచ్చు కదా అని ఉంది. అలాగే ఇంకా అర్హత కలిగిన వారు ఉన్నారని అంటున్నారు. తల్లికి వందనం విషయంలో కూడా పూర్తి పదిహేను వేలు చెల్లించాలని కోరిక అయితే ఉంది. అలాగే అర్హత పేరుతో కోతలు లేకుండా అందరికీ వర్తింపచేయాలని ఉంది. మూడు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎప్పటికపుడు డబ్బులు ఖాతాలో పడేలా చూస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఉచిత బస్సుల విషయం తీసుకుంటే లగ్జరీ బస్సులను పక్కన పెడితే డీలక్స్ దాకా ఉచితం కల్పించాలని కోరుతున్నారు. అలా అయితేనే రాష్ట్రవ్యాప్తంగా తిరిగేందుకు వీలు ఉంటుంది అని భావిస్తున్నారు.
ఏపీలో అప్పులు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి అన్న ఆందోళన అయితే మేధావులలో ఉన్నత వర్గాలలో ఉంది. దానికి కారణం ఉచిత పధకాలకు ఎక్కువగా వెచ్చిస్తున్నారు అని పన్ను కట్టేవారు అంతా కొంత అసంతృప్తిగా ప్రభుత్వం మీద ఉన్నారని అంటున్నారు. కేవలం 15 నెలలలోనే రెండు లక్షల కోట్ల అప్పులు చేయడం రాష్ట్ర ఆదాయానికి ఆరోగ్యానికి మంచిది కాదనే అంటున్నారు. ఏపీ సొంతంగా ఆర్ధిక స్థిరత్వం సాధించడానికి చాలా కాలం పడుతుందని ఈలోగా సంపద సృష్టి పెద్దగా జరిగేది ఉండదని అంటున్నారు. అందువల్ల ఖర్చులు వీలైనంతగా తగ్గించుకుని ఉత్పాదక రంగాల మీదనే అప్పులు తెచ్చిన నిధులు పెడితే బాగుంటుంది అని సూచిస్తున్నారు. ఉచితాల మీద అయితే వైముఖ్యం ఉన్నత వర్గాలలో విద్యావంతులలో కనిపిస్తోంది అంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేల తీరు మీద విమర్శలు ఉన్నాయి. అవినీతి చేతులు దాటిపోతోంది అని అంటున్నారు. చాలా చోట్ల సామంతరాజులు మాదిరిగా ఉంటూ చేస్తున్న అధికారిక పోకడల పట్ల జనంలో ఆగ్రహం వస్తోంది అని అంటున్నారు. ఒక లిక్కర్ విషయంలో విమర్శలు ఉన్నాయి. బెల్ట్ షాపులకు హద్దూ పద్దూ లేకుండా పోతోంది అని అంటున్నారు. ఉచిత ఇసుక పధకం సరిగ్గా లేదని విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఇంకా పదిహేను నెలలే అయింది కాబట్టి ప్రభుత్వం మీద అయితే పెద్దగా అసంతృప్తి లేదనే చెప్పాలి. ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.