ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడుగా నూతనంగా మరో 6 జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? కొత్త జిల్లాల కూర్పుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలెట్టిందా? అదేవిధంగా జిల్లా, మండలాలు, గ్రామాల పేర్లు మార్పునకు శ్రీకారం చుట్టనుందా? ఈ అంశాల అధ్యయనం కోసం మంత్రుల బృందం తో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. ఈ క్రమంలోనే మంత్రుల బృందం జిల్లాల పర్యటన ఖరారు కావడంపై వాదనలకు బలాన్ని చేకూరుస్తుంది.
పరిపాలన సౌలభ్యం పేరిట..
గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట 2022 సంవత్సరంలో ఏపీలో ఉమ్మడిగా ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్లమెంటు ప్రామాణికంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఆయా జిల్లాల పరిధిలో కొత్తగా రెవెన్యూ డివిజన్లను సైతం ఏర్పాటు చేశారు. అలా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల నుంచే పరిపాలన సాగిస్తున్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వం జిల్లాలను పునర్ విభజించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు అదనంగా మరో 6 జిల్లాలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది.
అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు..
ఏపీలో జిల్లాల పునర్విభజన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, సాంస్కృతిక నేపథ్యం, సామాజిక, ఆర్థిక స్థితిగతుల తో పాటు జనాభా ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వాటిని అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం మూడు బృందాలుగా విడిపోయి జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేయనుంది. ఏపీ రాజధాని అమరావతి తో పాటు ఆదోని, మార్కాపురం, పలాస, గూడూరు, మదనపల్లి ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 29 నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, అనిత, నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్‌లు పర్యటించనున్నారు. 29, 30న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో.. సెప్టెంబర్ 2న అల్లూరి జిల్లాలో వీరు పర్యటించనున్నారు.
కొత్త జిల్లాల నమూనా స్వరూపం ఇలా…
అమరావతి జిల్లా…
అమరావతి జిల్లా కేంద్రంగా అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు నూతన జిల్లాగా మారనున్నాయి.
పలాస జిల్లా…
పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం తో కలిపి పలాస జిల్లాగా ఏర్పాటు కానుంది.
మార్కాపురం జిల్లా…
మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శితో మార్కాపురం జిల్లాగా ఏర్పడనుంది.
గూడూరు జిల్లా…
గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట తో కలిపి గూడూరు జిల్లాగా ఏర్పాటు కానుంది.
మదనపల్లె జిల్లా…
మదనపల్లె, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లితో కలిపి జిల్లాగా ఏర్పాటు కానుంది.
ఆదోని జిల్లా…
ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలతో ఆదోని జిల్లాగా ఏర్పాటు కానుంది.
నియోజకవర్గాల పెంపు మరింత ఆలస్యం!
రాష్ట్రంలో 2014లో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో ఏపీలోని అసెంబ్లీ స్థానాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కానీ ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం తొలిదశలో జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టనున్నారు. రెండో విడత.. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్నారు. దీన్ని బట్టి కొత్త నియోజకవర్గాల పెంపు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.