సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు (Andhra Pradesh High Court) స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలోని మేజిస్ట్రేట్లకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే శాఖాపరమైన విచారణ, కోర్టు ధిక్కారణ చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు మేజిస్ట్రేట్‌లకు వివరాలు వెల్లడిస్తూ.. రిజిస్ట్రార్ జ్యుడీషియల్ సర్క్యులర్ జారీ చేశారు.
సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. నిందితులకు రిమాండ్ విధించే సమయంలో అర్నేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలని పట్టించుకోకుండా మేజిస్ట్రేట్‌లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు దృష్టికి వచ్చిందని ఏపీ హైకోర్టు గుర్తుచేసింది. మూడు నుంచి ఏడు సంవత్సరాల శిక్షపడే ఇలాంటి కేసుల్లో ముందుగా విచారణ చేశాకే మేజిస్ట్రేట్లు నిర్ణయం తీసుకోవాలని ఏపీ హై కోర్టు సూచించింది.
ప్రాథమిక విచారణకు ముందు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలని, 14 రోజుల్లో విచారణ ముగించాలని ఆదేశించింది. నిందితులు సదరు నేరాలను మళ్లీ మళ్లీ చేశారా?… సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా?… ఆధారాలను తారుమారు చేయగలరా?… కస్టోడియల్ విచారణ అవసరమా?… తదితర అంశాలపై మేజిస్ట్రేట్లు సంతృప్తి చెందిన తర్వాతే రిమాండ్ విధింపుపై నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు తెలిపింది. సర్క్యులర్‌లో సూచనలను మేజిస్ట్రేట్‌లు తప్పకుండా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరమైన విచారణను ఎదుర్కోవడమే కాకుండా కోర్టు ధిక్కారణ కింద చర్యలకు బాధ్యులు అవుతారని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది.