గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ వ్యవస్థకు నాటి సీఎం జగన్ అంకురార్పణ చేశారు. ప్రతీ రెండు వేల మందికి ఒక సచివాలయం అని డిజైన్ చేశారు. అంతే కాదు జిల్లా స్థాయిలో ఏఏ విభాగాలు ఉంటాయో అవన్నీ కూడా సచివాలయంలో ఉండేలా చూశారు. పది మందిని వార్డు గ్రామ సచివాలయాలలో నియమించారు. వారితోనే పౌర సేవలు మొత్తం నిర్వహించేలా రూపకల్పన చేశారు. అంతే కాదు వారితోనే క్షేత్ర స్థాయిలో పాలన జరిగేలా చూశారు. వైసీపీ అయితే ఇది గొప్ప పాలనాపరమైన సంస్కరణలుగా చెప్పుకుంటుంది.
అయితే వైసీపీ దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం మంచిదే కానీ తొందరపాటుతో చేశారో లేక ఎక్కువ మందికి ఉపాధి అన్న కాన్సెప్ట్ తో చేశారో తెలియదు కానీ వార్డు గ్రామ సచివాలయాల్లో మొత్తం లక్షా పాతిక వేల మంది దాకా సిబ్బందిని నియమించారు వీరందరికీ 35 వేల దాకా ఒక్కొకరికి వంతున చెల్లిస్తూ వస్తున్నారు. అనేక విభాగాలను అక్కడ అందుబాటులో ఉంచుతూ కార్యదర్శుల నియామకం చేశారు. అయితే ప్రతీ వార్డులో వివిధ విభాగాలకు సంబంధించిన పనులు లేకపోవడంతో ఉన్న పది మందిలో సగానికి పైగా పెద్దగా పని భారం లేకుండానే ఖాళీగా గడిపేసే పరిస్థితి ఏర్పడింది అంతే కాదు ఉన్న ఇద్దరు ముగ్గురి మీద భారీగా పని ఒత్తిడి పెరిగి అసంతూల్యంగా ఈ వ్యవస్థ తయారు అయింది అన్న విమర్శలు వచ్చాయి. అంతే కాదు పంచాయతీలకు వార్డులకు సమాంతరంగా ఈ వ్యవస్థ ఉందన్న చర్చ కూడా సాగింది.
ఇక తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేస్తోంది. ముందుగ మహిళా పోలీసుల విషయంలో నిర్ణయం తీసుకుంది వారు కోరుకుంటే పోలీస్ వ్యవస్థలో కానీ లేదా మహిళా విభాగంలో కానీ నియామకాలు జరిపేలా చర్యలు తీసుకుంది. అలాగే రేషనలైజేషన్ కింద మొత్తం వార్డులను కూడా కుదిస్తూ మరో నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం పౌర సేవలను అందిస్తూనే అవసరమైన సిబ్బందితోనే ఈ సచివాలయాలు నడిచేలా చూడాలని నిర్ణయించింది ఇక ఇందులో ప్రతిభావంతులను వేరే విభాగాలకు పంపిని అక్కడ సిబ్బంది కొరతను తీర్చుకోవాలని చూస్తోంది.
అలాగే వీరికి పదోన్నతులు పే స్కేల్ వంటి వాటి విషయంలో కూలకన్షంగా చర్చించేందుకు మంత్రులతో ఒక కమిటీని కూడా తాజాగా ఏర్పాటు చేసింది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటుగా మరో 9 మంది మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ మంత్రివర్గ ఉప సంఘం ప్రమోషన్లపై చర్చించి, అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదించనుంది.
అదే విధంగా ఈ సచివాలయాలలో ఇంటర్‌మీడియేటరీ పోస్టులను సృష్టించే అంశం గురించి చర్చించాలని కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆయా పోస్టుల పే స్కేల్ నిర్ణయించాలని సూచించింది. ప్రమోషన్ల తర్వాత ఖాళీల భర్తీని ఎలా పూర్తి చేయాలనే పద్ధతిపైనా చర్చించాలని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల అంశం గురించి అధ్యయనం పూర్తి చేసి సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించాలని కోరింది.
అంతే కాదు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ సచివాలయాలు పేరు తీసివేసి స్వర్ణాంధ్ర సెంటర్లని పెడితే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని అని అంటున్నారు. అలా చేయడం వల్ల పూర్తిగా దానికి కూటమి ప్రభుత్వం కళ వస్తుందని జనాలకు కొత్తగా ఉంటుందని పంచేసే సిబ్బందికి కూడా లక్ష్యాలు తెలుస్తాయని సాఫీగా పాలన క్షేత్ర స్థాయిలో జరిగేలా ఒక విధానం అమలు అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తొందరలో దీని మీద నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఇక ఈ కొత్త పేరు కనుక పెడితే వైసీపీ మా సృష్టి గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్పుకుని క్లెయిం చేసుకోవడానికి ఏమీ ఉండదని అంటున్నారు.


















