సాధారణంగా ఒక రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నప్పటి కంటే విపక్షంలో ఉన్నపుడే నాయకుల అవసరం చాలా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం మాట్లాడే గొంతులు అనేకం అవసరం పడతాయి. అధికార పార్టీ వైపు నుంచి వచ్చే విమర్శలను తిప్పికొడుతూనే తమ వైపు బలంగా వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అధికారాన్ని వారి దూకుడుని తట్టుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే వైసీపీలో ఏమిటో కానీ పార్టీలో ఎన్నో గొంతులకు మౌనంగా ఉండిపోతున్నాయి.
హార్డ్ కోర్ రీజియన్ గా వైసీపీకి ఉన్న రాయలసీమలో అయితే మాటే తెలియని మౌనం రాజ్యం చేస్తోంది. వైసీపీకి ఎందరో రాజకీయ ఉద్ధండులు లీడర్లుగా ఉన్నారు. పార్టీని మొదటి నుంచి తమ భుజాల మీద మోసిన వారు ఇపుడు సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. పార్టీకి అతి పెద్ద కష్టం వచ్చినా అధినేత జగన్ ముంగిటలో భారీ పరాజయం పలుకరించినా కూడా నేతలు నోరు విప్పడం లేదు దాంతో వైసీపీకి బలమైన ప్రాంతంలోనే ఈ కష్టాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.
వైసీపీ ఏర్పాటులో జగన్ తొలి అడుగులలో అంతా తామై నడచిన వారు ఎంతోమంది ఉన్నారు. అంతే కాదు 2014లో తృటిలో అధికారం తప్పినా కూడా పార్టీని అండగా నిలబడ్డారు. వారందరి కృషి వల్లనే పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత వైసీపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లను పక్కన పెట్టడం జరిగింది అన్న ఆక్రోశం వారిలో ఉంది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 50 మందికి పైగా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు గెలిస్తే వారికి పదవుల విషయంలో సరైన న్యాయం జరగలేదు అని అంటారు. దాని వల్లనే వారు వైసీపీలో ఉంటూనే తీవ్ర అసంతృప్తిగా ఉంటూ వచ్చారు అని చెప్పుకున్నారు. దాని ఫలితం 2024 ఎన్నికల్లో బాగా కనిపించింది అని కూడా చెప్పుకున్నారు.
తాజాగా జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. దీని కంటే ముందు హోరా హోరీగా వైసీపీ వర్సెస్ టీడీపీగా భారీ ఫైట్ సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ వైసీపీకి చెందిన కీలక నేతలు మౌన ముద్ర దాల్చడం జరిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని కోస్తా జిల్లాలకు చెందిన నాయకులు గొంతెత్తారు. మాజీ మంత్రులు పేర్ని నాని అంబటి రాంబాబు వంటి వారు దాదాపుగా ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చారు. వారే ఈసీ ఎదుట నిరసనలు వినిపించారు. కానీ బలమైన సీమ సామాజిక వర్గం నుంచి కీలక నేతలు ఎవరూ నోరు పెద్దగా మెదపలేదని గుర్తు చేసుకుంటున్నారు.
వైసీపీ ఓడి ఏణ్ణర్ధం అవుతోంది. అయినా ఇప్పటికీ అదే సంతృప్తి వారిలో గూడు కట్టుకుని ఉందా అన్నదే చర్చగా ఉంది అంతే కాదు వారి విషయంలో అధినాయకత్వం జోక్యం చేసుకుని తగిన విధంగా భరోసా ఇచ్చి దగ్గరకు తీయడం లేదా అన్నది మరో చర్చగా ఉంది. తాము ఇపుడు రంగంలోకి దిగినా ఒరిగేది ఏముంటుంది అన్న నిర్వేదం లేదా ఆవేదన వారిలో ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందా అని కూడా విశ్లేషిస్తున్నారు. పార్టీలో పెద్ద నాయకులుగా ఉన్న కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు చెందిన నేతలు స్పందించకపోవడం గమనార్హం అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీలో ఒక బలమైన సామాజిక వర్గంలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.