లిక్కర్’.. ఏపీలో ప్రస్తుతం సంచలనంగా మారింది.. ఇందులో స్కాం ఉందని టీడీపీ కూటమి సర్కారు.. అసలు లిక్కర్ పాలసీని సమర్థంగా అమలు చేసిందే తాము అని వైఎస్సార్సీపీ దేనికదే గట్టిగా వాదిస్తున్నాయి.లిక్కర్ ను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,200 కోట్లు చేతులు మారాయంటూ కూటమి సర్కారు కస్సుమంటోంది. అసలు తాము కొత్తగా ఒక్క డిస్టలరీకీ అనుమతి ఇవ్వలేదని.. మద్యం అంతా ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మామని.. బెల్టు షాపులను నిర్మూలించామని.. పర్మిట్ రూమ్ అనే వ్యవస్థనే లేకుండా చేశామని.. ఇంకా ఎక్కడినుంచి లంచాలు ఇస్తారని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది.
ఇక కూటమి సర్కారు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ముడుపులు పెద్దలకు చేరాయని.. ఈ లెక్కన ఏడాదికి రూ.600 కోట్లు, ఐదేళ్లలో రూ.3,200 కోట్లు లంచాలు మేశారని ఆరోపిస్తోంది. అయితే, ఇక్కడే ఒక విషయం చెప్పుకోవాలి. ఏపీలో 2019-24 మధ్య మద్యం అమ్మకాలన్నీ కేవలం నగదు రూపేణా మాత్రమే జరిగాయి. అంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ పేమెంట్లు కానీ, క్రికెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కానీ జరగలేదన్నమాట.
ఒకవేళ క్రెడిట్, డెబిట్, యూపీఐ ద్వారా మద్యం అమ్మకాలు సాగి ఉంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనేది చిరునామా దొరికేది. కానీ, నగదు చెల్లింపుల్లో డబ్బు వినియోగదారుడి నుంచి ప్రభుత్వ దుకాణంలోని అమ్మకాలు సాగించే వ్యక్తికి మాత్రమే చేరింది. కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు లంచాలు చేతులు మారాయంటే ఈ లెక్కలను కూడా చూడాల్సి ఉంటుంది. ఇక మద్యం కేసులో ప్రధాన ఆరోపణలు చేస్తున్న వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప నివాసాలు, కార్యాలయాలకు వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని కార్యాలయానికి విచారణకు రావాలని కోరారు.
దాదాపు రూ.3,200 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారాయంటున్న సిట్.. రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మరికొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఇంకాస్త సమాచారం సేకరించింది. పాలసీ రూపకల్పన, ఏ స్థాయిలో ఏ అధికారిని నియమించాలనే విషయంలో ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని, మద్యం పాలసీ రూపకల్పన, సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి డొల్ల కంపెనీలకు మళ్లించడంలో వీరి పాత్ర ఉందని భావిస్తోంది. పర్సంటేజ్‌లపై ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి మద్యం కంపెనీ యజమానులతో హైదరాబాద్, తాడేపల్లిలో పలుసార్లు సమావేశమ య్యారని, డబ్బును షెల్ కంపెనీల ద్వారా మళ్లించారని సిట్ చెబుతోంది.