రాజకీయాల్లోకి రావటమే కాదు వచ్చిన తర్వాత వారి హవాను నిలబెట్టుకోవడం అనేది నాయకులకు చాలా ముఖ్యం. ఏ చిన్న తేడా చేసిన అటు ప్రజల్లోనూ ఇటు రాజకీయంగా కూడా విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. ఇప్పుడు అలాంటి మహిళా నాయకులు చాలా మందే కనిపిస్తున్నారు. ఉదాహరణకు కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇటీవల కొన్ని బ్యాంకులు వారి ఆస్తులను వేలం వేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.
మరోవైపు హైదరాబాదులోనూ వారి వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని తాజాగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా తమను ఆదుకునే వారు ఎవరు అనేది రేణుక కుటుంబానికి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వారు నమ్ముకున్న పార్టీ వైసీపీలో ప్రభావం తగ్గడం, 2019 ఎన్నికలకు ముందు వ్యవహరించిన తీరు వంటివి బుట్ట రేణుకను రాజకీయంగా మైనస్ చేసేసాయి. ఇక, ఇప్పుడు వ్యాపార పరంగా కూడా దెబ్బ తినడంతో భవిష్యత్తు ఏంటి అనేది అగమ్యగోచరంగా మారింది.
నిజానికి 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి మద్దతు పలికారు. ఆ వెంటనే ఏమనుకున్నారో.. ఏమో.. మళ్లీ వైసీపీలోకి వచ్చారు. కానీ, అప్పటికే ఆమెపై నెగిటివ్ ప్రచారం జరిగింది. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నా.. లేనట్టుగానే నాయకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ నుంచి అదేవిధంగా వైసీపీ నుంచి కూడా మద్దతు కరువై కుమిలిపోతున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన యామిని బాల వ్యవహారం కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానే ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
టిడిపిలో ఉన్నప్పుడు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీలోకి మారారు. కానీ, ఇక్కడ కూడా ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో తిరిగి టిడిపి గూటికి చేరారు. చిత్రం ఏంటంటే ఉన్న శింగనమల టికెట్ ను పోగొట్టుకోవడంతో పాటు పార్టీలోనూ ప్రాధాన్యం కోల్పోయారు. ఇప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో యామిని బాల రాజకీయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.
కనీసం ప్రజల మధ్య కూడా రావడం లేదనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. శింగనమల నియోజకవర్గంలో బలమైన కుటుంబంగా పేరు తెచ్చుకున్నప్పటికీ సరైన విధానాన్ని అనుసరించని ఫలితంగా యామిని బాల అత్యంత స్వల్ప కాలంలోనే తెరమరుగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా నేటి తరం రాజకీయ నాయకులకు ఇలాంటి వారు ప్రధాన ఉదాహరణలుగా నిలుస్తున్నారు అన్నది వాస్తవం.