ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన వద్ద ఉందని భావిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసుల ఎదుట హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న దిలీప్… గురువారం దుబాయ్‌కి పారిపోయేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఫోన్ లొకేషన్ ద్వారా అతడి కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందం… చెన్నై ఎయిర్‌పోర్టులో ఉన్నట్లు గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు.
కమిషన్‌లు ఇచ్చే డిస్ట్లరీ యజమానులతో దిలీప్ కాంటాక్టులో ఉండేవాడని డిస్ట్లరీ యజమానులు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు. ఇతనితో పాటు రాజ్ కేసిరెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పీఏ చెబితేనే అక్కడి వెళ్లి కమిషన్లు వసూలు చేసే వారని విచారణలో తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతీ వారం లెక్కలు తేల్చి… ప్రతీ నెల 50 నుంచి 60 కోట్లను ఆయా వ్యక్తులకు ఇచ్చే వారని సమాచారం. డిస్ట్లరీ యజమానులకు నేరుగా ఫోన్లు చేసి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎంత ఇండెంట్ ఇచ్చారు… ఆ ఇండెంట్ నుంచి ఎంత కమిషన్ రావాలో దిలీప్ ఫోన్ చేసి చెబితేనే డిస్ట్లరీ యజమానులు కమిషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారని తేలింది.
రాజ్ కేసిరెడ్డి, డిస్ట్లరీలు ఇద్దరి మధ్య అనుసంధాన కర్తగా ఉన్న పైలా దిలీప్‌ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎవరి ఆదేశాలు మేరకు డిస్ట్లరీ యజమానులకు ఫోన్లు చేశారనేది పీఏ ద్వారా తెలుసుకోవచ్చని సిట్ భావించింది. ఇప్పటి వరకు చేసిన విచారణలో భాగంగా ఈ మొత్తానికి అనుసంధాన కర్తగా పైలా దిలీప్ ఉన్నాడని తేలింది. ఈ క్రమంలో దిలీప్ కాల్ డేటాపై సిట్ సమాచారం సేకరించింది. దిలీప్ ఎక్కడుంటాడు… అతని కదలికలపై నిఘా పెట్టి సిట్ అధికారులు.. మారు పేరుతో టికెట్ కొని చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాలని ప్రయత్నించినట్లు గుర్తించింది. వెంటనే చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకుని దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మద్యం కుంభకోణం కేసులో(Liquor Scam) ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని(Raj Kasireddy) సీఐడీ కస్టడీకి అప్పగించేందుకు విజయవాడ కోర్టు అనుమతిచ్చింది. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అతడిని విచారించేందుకు అంగీకరించింది. ఈ కేసులో కీలకంగా ఉన్న కసిరెడ్డిని విచారించేందుకు 10 రోజుల కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. వారం రోజులకు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేసిరెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు చూస్తున్నారు.
కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌కేసిరెడ్డిని(Raj Kasireddy) ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌కు(Liquor Scam) సంబంధించి కేసిరెడ్డికి అనేక మార్లు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా విచారణకు హాజరుకాకుండా కేసిరెడ్డి డుమ్మా కొడుతూ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చి రాత్రంతా కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. ఆపై తెల్లారి కూడా మరోసారి కేసిరెడ్డిని విచారించారు సిట్ అధికారులు. ఈ సందర్భంగా పలు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో సిట్ సేకరించిన పలు ఆధారాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణలో చెప్పిన సమాచారంతో సిట్ అధికారులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తొలుత అధికారులకు కేసిరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. రెండో విడత విచారణలో కొన్ని ఆధారాలతో సిట్ అధికారులు ప్రశ్నించగా… కొన్నింటికి సమాధానాలు చెప్పగా… మరికొన్నింటికి తనకు సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో కేసిరెడ్డి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేసిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. కేసిరెడ్డి పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.