రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. వాస్తవానికి అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ జరుగుతున్న పరిణామాలు, సీఎం చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు వంటి వాటిని గమనిస్తే మంత్రివర్గంలో మార్పులు ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు మంత్రులు సరిగా పనిచేయడం లేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశాల్లో కూడా ఆయన పదేపదే చర్చిస్తున్నారు.
అంతేకాదు పనిచేయని మంత్రులను పక్కన పెడతానని కూడా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హెచ్చరించారు. సో.. దీన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు ఖాయం. ఇక జనసేనకు మరో మంత్రి సీటు ఇవ్వాల్సి ఉంది. బిజెపి కూడా మరో సీటును ఆశిస్తోంది. ఈ రెండూ కూడా చంద్రబాబుకు కొంత ఇబ్బందిగానే మారాయి. దీంతో ఆయన మంత్రివర్గంలో మార్పులు చేసి జనసేనకు ఒకటి, బీజేపీకి మరొకటి ఇచ్చేసి మిగిలిన వాటిని మార్పులు చేర్పుల దిశగా అడుగులు వేయాలన్నది ఆయన తీసుకున్న నిర్ణయమని టిడిపి నాయకులు కూడా అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ముగ్గురు నుంచి నలుగురు టిడిపి మంత్రులను పక్కన పెడతారని తెలుస్తోంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా చర్చ నడుస్తుంది. అనంతపురానికి చెందిన ఓ మంత్రిని పక్కన పెడతారని అక్కడ చర్చ జరుగుతుంటే.. గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మంత్రిని పక్కన పెడతారని కోస్తా జిల్లాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గంలోకి చేరేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. వీరిలో తాజాగా తెరమీదకు వచ్చిన పేరు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు.
ఈయన పేరు కచ్చితంగా ఉంటుందన్నది టిడిపి వర్గాల్లోనూ బలంగానే వినిపిస్తుంది. అదే విధంగా విశాఖపట్నం కి సంబంధించి గంటా శ్రీనివాసరావు పేరు కూడా మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు వైసీపీ పై బలమైన పోరాటం చేయడంతో పాటు జగన్ను కార్నర్ చేయాలన్నది. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకత పెరగకుండా కాచుకోవాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ విషయంలోనే చాలామంది మంత్రులు వెనక పడ్డారు. ప్రతిపక్షం చేస్తున్న రాజకీయాలను బలంగా తిప్పి కొట్టడంలో మంత్రులు వెనకబడుతున్నారని దీనివల్ల ప్రభుత్వం ఎంత మంచి చేస్తున్న ప్రజల్లోకి చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణకు ప్రాధాన్యం ఏర్పడడం, బలమైన గళం వినిపించే వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని చర్చ నడుస్తుండడం విశేషం. మరి ఎవరిని తీసుకుంటారు.. ఏం జరుగుతుందనేది చూడాలి. ప్రస్తుతానికైతే రఘురామ కృష్ణ రాజు పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన బలమైన గళం వినిపించి వైసిపి పై ఒంటరిగానే పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన అమెరికాలో పర్యటించినప్పుడు కూడా మంత్రివర్గంలో చోటు కోసం తను ఆశించిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. సో ఈయన అయితే వైసిపి పై బలంగా మాట్లాడగలరని చంద్రబాబుకు కూడా ఉన్న ఒక అభిప్రాయం. దీనిని బట్టి ఆయనకు అవకాశం లభించడం ఖాయమేనని రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.