ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Fatal Road Accident) జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగింది. ఈ ఘటన ఇవాళ(సోమవారం, జులై14)న ఉదయం చోటుచేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి.
క్షతగాత్రులని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు వారి పరిస్థితిని సమీక్షించి చికిత్స అందిస్తున్నారు. తొమ్మిదిమంది మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతులు సబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ(25), గజ్జల లక్ష్మీదేవి (36), రాధ (39), వెంకట సుబ్బమ్మ(37) గజ్జల రమణ(42), మణిచంద్ర(38), గజ్జల దర్గయ్య(32), గజ్జల శీను(33) గుర్తించారు.
మృతులు రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదకరంగా మారింది. సమాచారం అందగానే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై లారీ బోల్తా పడి తొమ్మిది మంది కూలీలు మృతిచెందగా.. 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై మామిడి లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి తొమ్మది మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.
ఈ ప్రమాదంలో తొమ్మది మంది చనిపోయారని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు. మృతులంతా రైల్వేకోడూరు సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియడంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.