ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుల్లో ఒకరైన బాలాజీ గోవిందప్పను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సిట్ బృందం, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తోంది.
• ఎవరీ బాలాజీ గోవిందప్ప?
బాలాజీ గోవిందప్ప అంటే మరెవరో కాదు, భారతీ సిమెంట్స్ ఫుల్ టైమ్ డైరెక్టర్. ఈయనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇటీవల సిట్ అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. వారిలో బాలాజీ గోవిందప్ప, మాజీ సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) కృష్ణమోహన్ రెడ్డిలు ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో స్పష్టంగా ఆదేశించారు.
• నోటీసులకు డుమ్మా.. కోర్టుల్లో చుక్కెదురు..
అయితే, ఈ ముగ్గురూ సిట్ నోటీసులను బేఖాతరు చేశారు. విచారణకు హాజరుకాలేదు. అంతకుముందే, అరెస్ట్ భయంతో వీరు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ, హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టు తలుపుతట్టి మధ్యంతర రక్షణ కోరినా, అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది.
• స్కామ్ సూత్రధారులు వీరేనా?
సిట్ అధికారుల కథనం ప్రకారం, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారట. మద్యం సరఫరా సంస్థల నుంచి భారీగా డబ్బులు దండుకుని, వాటిని నకిలీ లేదా షెల్ కంపెనీలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ముడుపుల మొత్తాన్ని ఖరారు చేయడానికి వీరు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో కంపెనీల యజమానులతో రహస్య సమావేశాలు నిర్వహించేవారని సమాచారం.
డబ్బులు చేతులు మారాయా?
రాజ్ కేసీ రెడ్డి అనే వ్యక్తి ఈ ముగ్గురికీ లంచం డబ్బులు చేరవేసేవాడని, ఆ తర్వాత వీరు ఆ డబ్బును అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అందజేసేవారని సిట్ బలంగా అనుమానిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఇతర వ్యక్తుల రిమాండ్ రిపోర్టులలో ఈ సంచలన విషయాలు వెలుగుచూశాయి.బాలాజీ గోవిందప్ప అరెస్ట్‌తో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు, సంచలన నిజాలు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయని సిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ అరెస్ట్ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నారు.