అమరావతి ప్రభుత్వ సముదాయం (AGC)లోని భవనాలకు కొత్త టెక్నాలజీతో ‘డిస్ట్రిక్ట్ కూలింగ్’ ద్వారా శీతలీకరణ అందించనున్నారు. ఈ సముదాయంలోని ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు ఏసీ యంత్రాలు బిగించకుండా, వీటి స్థానంలో ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కూలింగ్ అందిస్తారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తబ్రీద్ సంస్థతో ఒప్పందంపై 2018లో సీఆర్డీఏతో సంతకాలు అయ్యాయి. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఒప్పందం అమలుకు నోచుకోలేదు. రూ.350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల సెంట్రల్ కూలింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. పాత ఒప్పందం ప్రకారం అదే ధరకు అందించేందుకు సదరు సంస్థ ముందుకొచ్చింది. దీనికి ప్రపంచ బ్యాంకు సైతం ఆమోదం తెలిపింది.
భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్:అమరావతిలో ఎక్కువగా భవనాలు ఉండే ప్రాంతాల్లో వ్యక్తిగత ఏసీలు ఏర్పాటు చేయకుండా, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సీఆర్డీఏ భావిస్తోంది. సెంట్రల్ ప్లాంట్ ద్వారా బహుళ భవనాలకు భూగర్భంలో ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కూలింగ్ అందిస్తారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉండదు. గడువు ముగిసిన తరువాత ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగిస్తారు.
అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ‘E’లో అసెంబ్లీ భవనాన్ని 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 3 అంతస్తుల్లో డిజైన్లు రూపొందించారు. హైకోర్టు సూపర్ బ్లాక్ ‘F’లో 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది.
బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులతో బిల్డింగ్‌ని నిర్మిస్తున్నారు. ఐకానిక్ టవర్లలో సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు రానున్నాయి. విస్తీర్ణం 68.88 లక్షల చదరపు అడుగులు. గుత్తేదారు సంస్థలకు ఇటీవలే సీఆర్డీఏ ఎల్‌వోఏలు అందజేసింది. వీటికి కొత్త వ్యవస్థ ద్వారా అందించే కూలింగ్ ద్వారా దాదాపు 50% మేర విద్యుత్తు ఆదా కావడంతో పాటు వ్యయంలో 20% వరకు తగ్గనుందని భావిస్తున్నారు.