ఏపీ రాజధాని అమరావతి మీద తరచూ వినిపించే వాదన ఏమంటే.. అంత భూమి ఎందుకు? అంత భూమిని రైతుల నుంచి సేకరించాల్సిన అవసరం ఏమిటి? కాస్త భూమి తీసుకొని చకచకా నాలుగైదు భారీ భవనాలు కట్టించేస్తే సరిపోతుంది కదా అని. అందుకు వేలాది ఎకరాల అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలు తరచూ ఎదురవుతుంటాయి. ఇలాంటి లెక్కలు మాట్లాడే వారికి ఒకే ఒక్క సూటిప్రశ్న. మన ఆస్తుల్ని పెంచుకోవటానికి అనుక్షణం తపిస్తుంటాం. ఎంత సంపద ఉన్నా.. ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాం. వ్యక్తిగతంగా ఆస్తిపాస్తుల విషయంలోనే రాజీ పడనప్పుడు.. ఒక జాతికి చెందిన రాజధాని నిర్మాణం విషయంలో పరిమితులు ఎందుకు పెట్టుకోవాలి?
పరిమిత భూమిలోనే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి. రాజధాని నగరం అన్నది ఒక జీవన విధానం. అదో కల్చరల్ సెంటర్ అవుతుంది. రాజధాని నగరం అన్నది నాలుగు ఎత్తైన భవనాలు మాత్రమే కాదు. తరతరాలు ఆ నగరంలో సౌకర్యవంత నివాసాలు ఉండేలా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. భూమి పరిమితం. అలాంటప్పుడు రాజధాని పరిధిని పరిమితి చట్రాల్లో చుట్టేస్తే.. మహానగరంగా ఉండే అవకాశాన్ని మనమే మిస్ అవుతాం.
హైదరాబాద్ ను తీసుకోండి. ఇప్పుడు కొన్ని రోడ్లను చూస్తే.. అక్కడ విస్తరణకు అవకాశం ఉండదు.కొండాపూర్ నుంచి గచ్చిబౌలికి నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. రద్దీ వేళల్లో.. ఆ రోడ్లను కాస్త విస్తరిస్తే బాగుండని అనుకుంటాం. కానీ.. అదెప్పటికి సాధ్యం కాదు. ఎందుకుంటే.. రోడ్డుకు అనుకొని ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటిని తీసేసి.. రోడ్డు విస్తరణ అసాధ్యం. పదిహేనేళ్ల క్రితం ఇదే రోడ్డును చూసినోళ్లు.. ఇంత పెద్ద రోడ్డు అవసరమా? అనోళ్లు ఉన్నారు. ఈ రోజున ఆ రోడ్డు సరిపోవటం లేదు. మరి.. మరో పాతికేళ్ల తర్వాత పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. పాలకులకు దూరద్రష్టి లేకపోతే ఇలాంటి ఇబ్బందే ఏర్పడుతుంది.
ఇక్కడే మరో ఉదాహరణ ప్రస్తావిస్తా. అందరికి తెలిసిన హైదరాబాద్ ఓఆర్ఆర్ సంగతే చూస్తే.. గచ్చిబౌలి ఎంట్రన్స్ లోనూ.. కొన్ని ఎగ్జిట్ల వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జాం అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే పాతికేళ్లలో పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. మొత్తంగా చెప్పేదేమంటే.. ఒక రాజధాని నగరాన్ని నిర్మించే వేళలో.. పరిమితులకు పోకూడదు. భవిష్యత్ ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకోవాలి. భూసేకరణ పరిమితం అనుకుంటే.. ఇప్పుడు బాగానే ఉంటుంది.
కానీ.. భవిష్యత్తులో ఇంత చెత్తగా డిజైన్ చేసినోడు ఎవరంటూ బండ బూతులు తిట్టటం ఖాయం. ప్రతిది రెడీమెడీగా.. ఇన్ స్టెంట్ గా అయిపోవాలన్న యావ ఈ తరానికి ఎక్కువ. అందుకు తగ్గట్లే రాజకీయ నాయకులు సైతం తమ రాజకీయ అవసరాల కోసం రాజధాని నిర్మాణం మాయాబజార్ సినిమాలో సీన్ల మాదిరి.. వెనువెంటనే ఆవిష్క్రతం కావాలని తపిస్తుంటారు. అలాంటి తొందరపాటుకు గురి కాకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే కష్టాలు ఖాయం. రాక రాక ఏపీకి రాజధాని నగరం తయారవుతున్న వేళ.. పొదుపు పరిమితులు పెట్టుకునే కన్నా.. భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగా డిజైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.