ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1న క్వాంటం వ్యాలీ ప్రారంభించేలా ప్రభుత్వం శరవేగంగా పనులు చేయిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తొలి ఐదు క్వాంటం కంప్యూటర్ హబ్ లలో అమరావతి ఒకటిగా చెబుతున్నారు. దీంతో అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామ్యం ప్రాతిపదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయస్థాయిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ ఏకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిద్వారా రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటం సేవలను అందించే కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సెమీ కండక్టర్ల తయారీ, వినియోగం, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, భవిష్యత్ తరాలకు ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్ఎఫ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ మెటీరియల్సులో రాష్ట్ర విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే క్వాంటం వ్యాలీ ఉద్దేశంగా చెబుతున్నారు.
అమరావతిలో క్వాంటం ట్యాలెంట్ హబ్ ను అమెరికాకు చెందిన విసెర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. 100 మంది అత్యున్నత స్థాయి పరిశోధకులకు తయారుచేస్తుంది. ఎన్వీఐడీఐఏ సంస్థ ఏఐ, క్వాంటం సిమ్యులేషన్ ప్లాట్ఫాం సమీకృతం చేస్తుంది. రాజధానిలో హైబ్రిడ్ సూపర్ కంప్యూటింగ్ స్టోరేజ్ నిర్మిస్తుంది. అదేవిధంగా ఏడబ్ల్యూఎస్ సంస్థ అమరావతి ఏడబ్ల్యూఎస్ యాక్సిలరేటర్‌ను ప్రారంభిస్తుంది. 50వేల మంది యువత, మహిళలకు ఏడబ్ల్యూఎస్ బ్రాకెట్ ద్వారా సర్టిఫికెట్లు జారీచేస్తుంది. క్వాంట్రోలాక్స్ సంస్థ రూ.25 కోట్లతో ‘విద్యాకర్’ ప్లాట్‌ఫాంను నిర్మిస్తుంది. ఇది ఓపెన్-ఆర్కిటెక్చర్ బెంచ్‌మార్క్ సిస్టమ్. ఇక పీక్యూ స్టేషన్ సంస్థ టెస్ట్‌బెడ్, డెమోల్యాబ్‌లతో కూడిన పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్‌ను నెలకొల్పుతోంది.
ఈ సంస్థల సహకారంతో 50 వేల మందికి పైగా విద్యార్థులకు మౌలిక క్వాంటం నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వీరిలో 3 వేల మందికి అత్యున్నత శిక్షణ, గ్లోబల్ పరిశోధన, అభివృద్ధికి 100 మంది ఉన్నత పరిశోధకులను సన్నద్దం చేస్తారని అంటున్నారు. జాతీయ క్వాంటం మిషన్, రాష్ట్ర క్వాంటం వ్యాలీకి ఉపకరించేలా శాశ్వత క్వాంటమ్ ట్యాలెంట్ హబ్ ఏర్పాటు లక్ష్యమని వెల్లడించాయి. 108 టీచింగు ల్యాబ్ల ఏర్పాటుకు 108 సంస్థల నుంచి 134 ప్రతిపాదనలు వచ్చాయి. అల్గోరిథమ్ పరిశోధనకు 55 సంస్థల నుంచి 84 ప్రతిపాదనలు అందాయి. 197 వర్సీటీల్లో శిక్షణ పొందిన 1056 మంది ఫ్యాకల్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. 137 కాలేజీల నుంచి 1127 హ్యాకథాన్ ఆలోచనలు తీసుకున్నారు. ఇందులో 3 వేల మందికి పైగా విద్యార్థులు పంచుకుంటారు. దిమిరా (ఐఐటీ-బోంబే), ఇండ్ రోబో, రియలిస్టిక్, క్వాంటోల్ స్పియర్, క్యూరియం వంటి స్టార్టప్స్ భారత క్వాంటం సప్లయ్-చైన్ జిల్లా కోసం కంట్రోల్ ఎలక్ట్రానిక్స్, వైరింగ్ వ్యవస్థలు, యాంప్లిఫయర్లను అభివృద్ధి చేస్తున్నాయి.
ఇలా ఒక్క ఏడాదిలోనే భావన నుంచి అమలు స్థాయికి విజన్ నుంచి విలువైన భాగస్వామ్యాల వరకు ఏపీ ఎదిగింది. వ్యవస్థల స్థాపన, పరికరాలు తయారీ, విద్యార్థులకు శిక్షణ, టెక్నాలజీ ఎగుమతులు తదుపరి అధ్యాయం, డీఆర్డీవోతో భాగస్వామ్యం నుంచి క్వాంటమ్ ఫ్యాబ్ ప్రతిపాదన వరకు ఫిజిత్సుతో జాయింట్ వెంచర్, పాస్కల్ సభ అభివృద్ధి నుంచి వైజర్ ప్రారంభం దాకా ప్రతి కార్యాచరణా భారత క్వాంటమ్ ఫౌండేషన్ కు ఒక్కో ఇటుకరాయివంటిది. 2030 నాటికి అమరావతి కేవలం క్వాంటమ్ కంప్యూటర్లకే గాక యావత్ పరిశ్రమకే కేంద్రం అయ్యే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. భారత్ ప్రపంచం కోసం భవిష్యత్ ను నిర్మించే క్రమంలో ఏపీ నిర్మాణ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


















