లండన్ పర్యటనలో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ప్రతిష్టాత్మక `డిష్టింగ్విష్డ్ ఫెలో షిప్` అవార్డును సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అందుకున్న విషయం తెలిసిందే. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన కార్యక్రమంలో లండన్ వేదికగా భువనేశ్వరి ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవాసాంధులు, ఎన్నారై టీడీపీ నాయ కులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నారా భువనేశ్వరిని ఘనంగా సత్కరించి.. అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కూడా భువనేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం.. గురువారం ఉదయం నారా భువనేశ్వరి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ అవార్డును దక్కించుకోవడం వెనుక తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్ఫూర్తి ఉందన్నారు. అదేవిధంగా సమాజానికి ఏదైనా చేయాలన్న సేవా గు ణం కూడా కారణమని తెలిపారు. “ఈ అవార్డు పూర్తిగా సేవారంగానికి, అంకిత భావానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా“ అని భువనేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టును ఏర్పాటుచేసి.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు, పేదలకు దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్నట్టు భువనేశ్వరి తెలిపారు. వారు కోలుకునే వరకు అండగా ఉంటున్నామన్నారు. అనాథ చిన్నారుల విద్యకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ స్థాపిం చి.. వారిని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదివిస్తున్నట్టు తెలిపారు. వితంతు మహిళలకు చేతివృత్తుల్లో శిక్షణ ఇప్పించి.. ఆర్థికంగా వారు ఎదిగేందుకు దోహదపడుతున్నట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులలోనూ ఎన్టీఆర్ ట్రస్టులు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా సమాజానికి సేవ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం లభించిన అవార్డు.. సేవారంగానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని భువనేశ్వరి తెలిపారు.


















