రాజకీయాల్లో నిరంతరం మార్పు అవసరం. ఎవరు ఏమిటి అన్నది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. అన్నింటికీ మించి ఇది ప్రజలతో కూడుకున్న రంగం. ప్రజలతో నడిచే వారికే ఆదరణ ఉంటుంది. ఆ దిశగా పార్టీని నాయకులను ప్రజలకు చేరువ చేయడానికి అనుక్షణం కృషి చేయాల్సి ఉంటుంది. ఇక అధికారంలో ఉండే పార్టీలకు కొన్ని అడ్వాంటేజెస్, మరి కొన్ని డిస్ అడ్వాంటేజెస్ ఉంటాయి. విపక్షంలో ఉన్న పార్టీకి అయితే ఎక్కువ స్వేచ్చ ఉంటుంది అందువల్ల సరిగ్గా ఉపయోగించుకుంటే ఇదే సరైన సమయం అని అంతా అంటున్నారు.
సేనతో సేనాని అని ఈ మధ్యనే మూడు రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించి వారికి బూస్ట్ ఇచ్చారు. పార్టీ గురించి వారికి చెప్పారు. అలాగే క్యాడర్ గురించి తెలుసుకున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దాని వల్ల జనసేనలో కొత్త ఉత్సాహం వచ్చింది. అదే విధంగా వైసీపీ కూడా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు, కార్యకర్తలతో జగన్ మీటింగులు ఎపుడు అన్న చర్చ అయితే సాగుతూ వస్తోంది.
పార్టీకి జీవనాడి క్యాడర్, నాయకులు అన్న వారు పదవులు ఉంటే ఒకలా లేకపోతే మరొకలా ఉంటారు. కానీ ఆరు గాలం పనిచేసేది క్యాడర్. పైగా వారు ఒక్కసారి జెండా పట్టుకుంటే చచ్చేదాకా వదలరు. అంతటి అభిమానం వారి సొంతం. అందువల్ల క్యాడర్ ని గట్టిగా ఉంచుకోవాలి. వారి మన్నననలు పొందాలి. వారిని ఆదరించాలి. టీడీపీ ఎపుడూ చేసే కార్యక్రమం అదే. మరి జనసేన కూడా అదే దారిలో వెళ్తోంది. వైసీపీ కూడా అదే తీరున ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ ఉన్న కార్యకర్తలతో అధినేత నేరుగా భేటీలు వేస్తే గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు తెలుస్తాయని అంటున్నారు.
జగన్ కి ఓటమి తరువాత కొన్ని తెలిసి వచ్చాయని అంటున్నారు. సర్వేలను నమ్ముకుని చేసిన 2024 ఎన్నికలు పుట్టెని నిండుగా ముంచాయన్నది అర్ధం అయింది అని అంటున్నారు. అందువల్ల సర్వేల జోలికి అయితే ఈసారి పోదలచుకోలేదని చెబుతున్నారు ఇది మంచి విషయంగానే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కోటరీ నుంచి కూడా జగన్ దూరం అయితే క్యాడర్ తో బంధం గట్టిగా పెనవేసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అంటున్నారు. ఈ రోజుకీ కోటరీ జగన్ చుట్టూ ఉందని అంటున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డి వంటి వారు కూడా విమర్శలు దాని మీదనే చేశారు. జగన్ పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది అన్నది తానే స్వయంగా తెలుసుకుని దానికి తగినట్లుగా పార్టీని తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
మరో వైపు చూస్తే పనిమంతులకు పెద్ద పీట వేయాలని అంతా కోరుతున్నారు. చాలా చోట్ల గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే వారిలో ఎక్కువ మంది జనంలో రావడం లేదు. ఇక క్యాడర్ కి అందుబాటులో ఉండని వారు ఉన్నారు. ప్రజాదరణ విషయంలోనూ అంతగా గ్రాఫ్ లేని వారు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక ప్రజా సమస్యల మీద పార్టీ కోసం పనిచేసే వారిని ఎంపిక చేయకపోతే క్యాడర్ కి నేతలకు మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందని అది చివరికి పార్టీకి ఇబ్బంది తెస్తుందని అంటున్నారు. అందువల్ల ఎవరిని ఇంచార్జిగా చేయాలన్న దాని మీద క్యాడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే అంతా కలసి పనిచేస్తారు అని అపుడు పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. మరి ఈ సూచనలు అన్నీ వైసీపీ అధినాయకత్వం ఆలకించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి ఈ రోజు నుంచే సంసిద్ధం చేయాలని కోరుతున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే బలమైన అడుగులు పడాలని అంతా కోరుతున్నారు.