ఉత్తరాంధ్ర జిల్లాల మీద జగన్ ఫోకస్ పెడుతున్నారు. నిజానికి విభజన ఏపీలో ఉత్తరాంధ్ర రాజకీయ తులాబారంగా మారింది అన్నది విశ్లేషకుల మాట. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఏపీలో ఉన్న మొత్తం 175 సీట్లలో ఇవి ఐదవ వంతు. అంటే ఇరవై శాతం అన్న మాట. ఈ సీట్లలో మెజారిటీ ఎవరికి దక్కుతుందో వారిదే ఏపీ సింహాసనం అన్నది కూడా తెలిసిందే. ఇది గతంలో రుజువు అయింది కూడా. 2014లో టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఏపీలో అధికారం దక్కింది. 2019లో వైసీపీ ఉత్తరాంధ్రను దాదాపుగా స్వీప్ చేసి పారేసింది దాంతో ఆ పార్టీకే పవర్ దక్కింది. ఇక 2024లో అయితే కూటమి మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. దాంతో తిరుగులేని అధికారాన్ని ఏపీలో చలాయిస్తోంది.
ఏపీలో రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణలు చూస్తే కనుక వైసీపీకి గ్రేటర్ రాయలసీమ తరువాత ఎక్కువగా కలసి వచ్చేది అనుకూలించేది ఉత్తరాంధ్ర రీజియన్ అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ రీజియన్ లో ఆరు ఉమ్మడి జిల్లాలు 74 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీట్లు వైసీపీ సంపాదించుకుంటే ఆ తరువాత ఆశగా ఎదురు చూసేది మాత్రం ఉత్తరాంధ్ర మీదనే. అక్కడ ఒక అరవై సీట్ల దాకా వైసీపీ సంపాదించుకుంటే మరో పాతిక సీట్ల దాకా ఉత్తరాంధ్ర కవర్ చేస్తే మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లకు మిగిలినవి క్రిష్ణా గుంటూర్, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వస్తాయి. అలా చూస్తే వైసీపీకి చాలా ఇంపార్టెంట్ ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉంది అన్నది సత్యం.
ఇక వైసీపీ ఓడిన ఏడాదిన్నర తరువాత ఆపరేషన్ ఉత్తరాంధ్ర తో కొత్త ప్లాన్ కి తెర తీశారు. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అంటే ఈ ఏడాదిన్నర కాలంలో కూటమి పాలన తీరు తెన్నులూ ఉత్తరాంధ్ర జిల్లాల మీద పడిన ప్రభావం ప్రజల ఆలోచనలు అన్నీ కూడా కలుపుకుని వైసీపీ తీసుకోవాల్సిన పొలిటికల్ స్టాండ్ గురించి డిసైడ్ కావడం కోసమే అని అంటున్నారు. ఇపుడు వైసీపీకి ఉత్తరాంధ్ర సమస్యలు తమ హయాంలో చేసిన అభివృద్ధి కూటమి వచ్చాక ఏమి చేశారు ఇవన్నీ కూడా ముందున్నాయి. దాంతో వైసీపీ ఇక మీదట గట్టిగానే జనంలోకి వెళ్ళాలని చూస్తోంది అంటున్నారు.
ఉత్తరాంధ్ర భూములను తీసుకోవడం మీద వైసీపీ ఎక్కువగా దృష్టి పెడుతోంది. కారు చౌకగా ఇక్కడ భూములు తీసుకుంటున్నారని తమకు అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు కార్పోరేట్ శక్తులకు రూపాయికి ఎకరం అన్నట్లుగా ఇచ్చేస్తున్నారు అని వైసీపీ మండిపడుతోంది. అంతే కాకుండా ప్రజారోగ్యం దెబ్బ తినేలా కాలుష్య పరిశ్రమలను డంప్ చేస్తున్నారు అని బల్క్ డ్రగ్ పార్క్ ని ఎత్తి చూపిస్తోంది. ఈ పార్క్ వద్దే వద్దు అంటోంది. విశాఖ నడి బొడ్డున లూలూ మాల్ కి ఎలా అత్యంత ఖరీదైన భూములు ఇస్తారని ప్రశ్నిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూంటే మౌనం ఎందుకు అని నిలదీస్తోంది. మరో ప్లాంట్ ప్రైవేట్ సెక్టార్ లో ఏర్పాటు చేయిస్తూ ప్రభుత్వ రంగంలోని ప్లాంట్ ని ఏమి చేయబోతున్నారని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క రూపాయి అయినా ఉత్తరాంధ్ర కు ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అని మరో చర్చను ముందుకు తెస్తున్నారు. అమరావతికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు వెనకాడని వారు ఉత్తరాంధ్ర ఏమి పాపం చేసిందని నిధులు ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ రోజు వరకూ తాము ప్రారంభించిన పరిశ్రమలను కార్యక్రమాలను ప్రాజెక్టులను మాత్రమే తమవిగా చెప్పుకుంటున్నారు తప్పించి కూటమి ప్రభుత్వం కొత్తగా ఉత్తరాంధ్ర కు ఇచ్చింది ఏమిటి తెచ్చింది ఏమిటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. రానున్న కాలంలో వివిధ రకాలైన అంశాల మీద ఉత్తరాంధ్ర అన్యాయం మీద కూటమి సర్కార్ మీద సమర శంఖం పూరిస్తామని చెబుతున్నారు. చూడాలి మరి వైసీపీ ఆందోళలలు ఏ విధంగా సాగుతాయో, ప్రజల మద్దతు ఎలా ఉంటుందో కూటమి వేసే ఎత్తుకు పై ఎత్తులు ఎలా ఉంటాయో. ఏది ఏమైనా 2019 నాటి మ్యాజిక్ ని రిపీట్ చేసి 2029లో అద్యధిక సీట్లు గెలుచుకోవాలని వైసీపీ రంగంలోకి దిగుతోంది.