అవును వైసీపీ అధినేత జగన్ మారిపోయారు. ఆయన గతానికి భిన్నంగా ఇపుడు వ్యవహరిస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తిస్తున్నారు. దానిని సరిదిద్దుకునేందుకు కూడా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇది వైసీపీ వారు అంతా కోరుకున్నదే. ఇపుడు అదే బాటలో జగన్ నడుస్తున్నారు. పార్టీ సుప్రీం. పార్టీతోనే అంతా. పార్టీ లేకపోతే ఎవరూ లేరు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అధికారం అందించేంత వరకే పార్టీ గుర్తుంటుంది. ఆ తరువాత అధికారం మత్తులో పార్టీని మరచిపోతూంటారు. ఇది అందరూ చేసే పనే. మరి వైసీపీ కూడా అచ్చం అలాగే చేసింది. బొక్క బోర్లా పడేలా ఫలితాలు వచ్చాయి. 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చిన క్యాడర్ ని సైడ్ చేసి పాలించిన దానికి జనాలు పార్టీ జనాలు కలసి కఠినమైన తీర్పునే ఇచ్చారు. దాంతో ఇపుడు వైసీపీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకుంటోంది.
ఇదిలా ఉంటే పార్టీతోనే తాను అని జగన్ ఈ మధ్య పదే పదే చెబుతూ వస్తున్నారు. వైసీపీ 2.ఒ అని కూడా ఆయన అంటున్నారు. ఈసారి వైసీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే రాజు అని కూడా స్పష్టంగా చెబుతున్నారు. గత నెల మూడవ వారంలో జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు అందరికీ దిశా నిర్దేశం చేశారు. గట్టిగా పదిహేను రోజులు తిరగకుండానే మరోసారి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో జగన్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
వైసీపీ వీక్ గా ఉన్న ప్రాంతాలు అలాగే పార్టీలో సరిగ్గా పనిచేయని నాయకులు ఉన్న ప్రాంతాలను గుర్తించి మరింత గట్టిగా పనిచేయాలని జగన్ ఈ సందర్భంగా సూచించనున్నారు అని అంటున్నారు. అంతే కాదు పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళాలని ఆయన కోరుతున్నారు. ప్రతీ బూత్ స్థాయిలో పార్టీ కార్యవర్గం ఉండాలని ఆయన ఆదేశిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏ రకమైన స్ట్రక్చర్ ఉందో బూత్ లెవెల్ లో అదే స్ట్రక్చర్ ఉండాలని అంటున్నారు. మహిళ రైతు, యువత, విద్యార్ధి, కార్మిక ఇలా వివిధ వర్గాలతో అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
పార్టీని ఎక్కడికక్కడ వికేంద్రీకరణ విధానంలో ముందుకు తీసుకుని వెళ్లాలని జగన్ కోరుతున్నారు. అంతా కలసి కట్టుగా జనంలోకి వెళ్ళాలని ఆయన చెబుతున్నారు. ఒక ఇష్యూ మీద ఆయా జిల్లాలతో పాటు వీలైతే రీజియన్ మొత్తం పార్టీ అంతా ఒక్కటిగా నిలిచి పోరాడితే ఆ ఇంపాక్ట్ కచ్చితంగా మంచి రిజల్ట్ ని తెస్తుందని జగన్ చెబుతున్నారు. అదే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకోవాలని సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆయన కోరుతున్నారు. మొత్తంగా మోనిటరింగ్ చేయడం జరుగుతుందని అవకాశాలు పనిమంతులకే అని జగన్ స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద పార్టీ గురించి ఫుల్ ఫోకస్ జగన్ పెడుతున్నారు. తాను కనిపించకుండా పార్టీ మాత్రమే కనిపించాలని పార్టీ బలమే వైసీపీ బలం కావాలని జగన్ నయా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ బలంగా ఉంటేనే పది కాలల పాటు కొనసాగుతామన్న సందేశాన్ని ఆయన ఇస్తున్నారు.