వైసీపీకి 2024 ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు వచ్చాయన్నది తెలిసిందే. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో అందరికీ సులువుగా తెలిసినది వాలంటీర్లు అని చెబుతారు. వారికి ప్రభుత్వ ఖజానా నుంచి అయిదు వేల గౌరవ భృతి ఇచ్చి మరీ పౌర సేవలకు తీసుకున్నారు వారు ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యేలా చూశారు. ఎన్నికల వేళ వారు ఇబ్బడి ముబ్బడిగా వైసీపీకి ఉపయోగపడతారు అని గట్టిగా నమ్మారు. కానీ వైసీపీ ఒకటి తలిస్తే వ్యవస్థలు వేరొకటి తలచాయి. ఫలితంగా వాలంటీర్ల బంధం ఎన్నికల ముందు కట్ అయింది. ఇటు క్యాడర్ చెల్లాచెదురైంది. ఇలా రెండింటికీ చెడి వైసీపీ చేదుని మింగాల్సి వచ్చింది.
చిత్రమేంటి అంటే వాలంటీర్ల వ్యవస్థ అన్నది వైసీపీ అధినాయకత్వం విశ్వామిత్ర సృష్టి. వారికి అయిదు వేల గౌరవ వేతనం గా నిర్ణయించారు. అయిదేళ్ల పాటు వారి సేవలను కూడా ఉపయోగించుకుని ఠంచనుగా తాము ఎంత చెప్పామో అంత గౌరవ వేతనం కూడా వేశారు. కానీ అయిదు కాదూ పది వేలు అని కూటమి అనగానే ఆ వైపునకు వాలంటీర్లు మొగ్గు చూపారు. ఎన్నికల వేళ అయిదేళ్ల వైసీపీ వైపు కనీసంగా కూడా కృతజ్ఞత చూపకుండా కూటమిని గెలిపించే పనిలో సక్సెస్ అయ్యారు ఇదంతా కళ్ళ ముందు ఉన్న విషయం.
అయితే మొత్తం ఏపీవ్యాప్తంగా 2 లక్షల 70 వేల మంది వాలంటీర్లను నియమించారు. ఇందులో పార్టీ సానుభూతిపరులు ఉన్నారు. వారితో పాటుగా ఇతరులూ ఉన్నారు. అయితే వైసీపీ సానుభూతిపరులు మాత్రం పార్టీ కోసం చేసారు అన్నది పార్టీ నాయకులు ఇచ్చే గ్రౌండ్ రిపోర్టు అంటున్నారు. వారికి జనంతో నేరుగా కనెక్షన్ ఉంది. ఎటూ కూటమి వారిని ఉద్యోగాలలోకి తీసుకోలేదు దాంతో వైసీపీ వారి సేవలను ఉపయోగించుకుంటే మేలుగా ఉంటుందని నాయకులు పార్టీకి సూచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోఅంది అని భోగట్టా.
వైసీపీకి బూత్ లెవెల్ దాకా క్యాడర్ ఉంది. అయితే క్యాడర్ కొంత డీ మోరలైజ్ అయింది. వారిని దారిలోకి తెస్తూనే వైసీపీకి సానుభూతిపరులుగా ఉన్న వాలంటీర్లను కూడా జత చేస్తే క్షేత్ర స్థాయిలో వైసీపీ యాక్టివిటీ బాగా పెరుగుతుందని పార్టీ లో ఒక చర్చ సాగుతోందిట. వాలంటీర్లే ఎందుకు అంటే వారు అయిదేళ్ళ పాటు పౌర సేవలు అందించారు. వారి వల్ల పధకాలు పొందిన జనాలు ఉన్నారు. వారితో నేరుగా పరిచయాలు ఉన్నాయి. అందువల్ల వారి ద్వారా జనం వద్దకు వెళ్ళడం సులువు అని అంటున్నారు. అందుకే వారిని మళ్లీ ఫీల్డ్ లోకి దించాలని చూస్తున్నారు అని అంటున్నారు.
అయితే ఆది నుంచి వైసీపీ క్యాడర్ లో వాలంటీర్ల మీద ఒక రకమైన ప్రతికూల భావన ఉంది వారిని తమ స్థానంలోకి తెచ్చారు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. దాంతో వారికి ప్రయారిటీ ఇచ్చి పార్టీలో కీలకం చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయా అన్నది చర్చగా ఉందిట. రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే వీరిని తిరిగి వాలంటీర్లుగా విధులలోకి తీసుకుంటే తమ సంగతేంటి అన్న బెంగ భయం కూడా ఉండడం సహజం అని అంటున్నారు. అయితే అలాంటి భయాలు పోగొట్టాల్సిన అవసరం అధినాయకత్వం మీద ఉంది. అంతే కాదు మరోసారి పార్టీ పవర్ లోకి వచ్చినా వాలంటీర్లకు అసలు చోటు ఇవ్వమని స్పష్టంగా చెప్పాల్సి ఉందని అంటున్నారు. అపుడే వారి సేవలు పార్టీలో ఉపయోగించినా అపోహలు కానీ అభ్యంతరాలు కానీ ఉండవని అంటున్నారు