భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం తరువాత మహిళకు భర్త ఇంటి పేరు మాత్రమే ఉంటుంది. పుట్టింటి పేరు అక్కడే ఉండిపోతుంది. మరీ ముఖ్యంగా తెలుగు నాట దీనిని ఎక్కువగా నమ్ముతారు. ఇపుడు ఈ చర్చ ఎందుకు అంటే రెండు ప్రముఖ తెలుగు రాజకీయ కుటుంబాల నుంచి ఇద్దరు ఆడపడుచులు సొంత రాజకీయం చేస్తున్నారు. వారు తన సొంత వారికే ప్రత్యర్థులుగా మారారు. దానితో వారి పుట్టింటి అత్తింటి పేర్ల మీద చర్చ సాగుతోంది. షర్మిల విషయానికి వస్తే వైసీపీలో ఉన్నంతవరకూ ఆమె వైఎస్ షర్మిలగానే ఉన్నారు. ఆనాడు ఎవరికీ ఏ రకమైన అభ్యంతరాలు అయితే లేవు. ఎపుడైతే ఆమె ఏపీకి పీసీసీ చీఫ్ గా వచ్చారో నాటి నుంచే ఆమె ఇంటి పేరు వైఎస్ కాదు మొరుసుపల్లి అని నిర్ధారించారు. ఇక కల్వకుంట్ల కవితగా రాజకీయం చేస్తున్న ఆమె ఇంటి పేరు కూడా అది కాదు ఆమె భర్త ఇంటి పేరు అయిన దేవనపల్లి అని కూడా డిసైడ్ చేశారు.
ఇదిలా ఉంటే సోమవారం షర్మిలతో పాటు ఆమె కుమారుడు రాజారెడ్డి కర్నూల్ కి వెళ్ళారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారు అని ఈ సందర్భంగానే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మీడియా సైతం దానిని హైలెట్ చేసింది. అంతే కాదు వైఎస్ రాజారెడ్డి అని కూడా ప్రచారం సాగింది. అయితే దీని మీద సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆయన ఇంటి పేరు వైఎస్ ఎలా అవుతుంది. ఆయన మొరుసుపల్లి కదా అంటూ లాజిక్ పాయింట్లు లేవదీస్తున్నారు.
అయితే వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్సార్ తండ్రి. ఆయన ఆ కుటుంబంలో మొదటి తరం రాజకీయ నాయకుడు. పులివెందుల సర్పంచుగా చాలా కాలం పనిచేశారు. ఆయన పేరు షర్మిల కుమారుడికి పెట్టారు అని అంటారు. అంతవరకూ బాగానే ఉన్నా వైఎస్ రాజారెడ్డి అంటే పెద్దాయన గుర్తుకు వస్తారు కదా అని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు. అందువల్ల వైఎస్ రాజారెడ్డి అంటే నో ఎస్ అని అనేస్తున్నారు.
వైఎస్ అన్నది ఏపీలో పవర్ ఫుల్ పొలిటికల్ బ్రాండ్. ఆ బ్రాండ్ కోసమే ఫైటింగ్ అన్నా చెల్లెలు మధ్య సాగుతోంది అని అంటున్నారు. తానే అసలైన వైఎసార్ వారసురాలు అనిపించుకోవడానికి షర్మిల ఒక వైపు ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తన తండ్రి ఆశయాలను బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని సైతం గుర్తు చేస్తున్నారు. అంతే కాదు వైఎస్సార్ కి సిసలైన వారసత్వం తనదే అని అంటున్నారు. మరో వైపు చూస్తే వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టి దానిని పదిహేనేళ్ళుగా నడిపిస్తున్న జగన్ ఉన్నారు. రాజకీయంగా ఆయన అనేక విజయాలను కూడా అందుకున్నారు. ఇపుడు వైఎస్ బ్రాండ్ మీద మరో వారసుడు వస్తున్నారు అన్న ప్రచారంతో వైసీపీ కరడు కట్టిన సోషల్ మీడియా అభిమానులు అయితే రియాక్ట్ అవుతున్నారు.
ఎవరైనా రాజకీయాల్లోకి రావవచ్చు. కానీ వైఎస్సార్ వారసత్వం మాత్రం వైసీపీదే అని చెబుతున్నారు. దాంతో పాటుగా వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం వార్తల మీద కూడా స్పందిస్తున్నారు. ఆయన మొరుసుపల్లి రాజారెడ్డిగా రాజకీయాలు చేసుకోవచ్చు అని అంటున్నారు. దీంతో వైఎస్ పేరు మీద సరికొత్త రచ్చ సాగనుందా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి షర్మిలను మొరుసుపల్లి అని వైసీపీ వారు గుర్తు చేసినా ఆమెను ఈ రోజుకీ అంతా వైఎస్ షర్మిలగానే సంభోదిస్తున్నారు. అలా ఆమె కుమారుడిగా రాజకీయాల్లోకి కనుక రాజారెడ్డి వస్తే ఆయన కచ్చితంగా వైఎస్ రాజారెడ్డిగానే జనంలో ముద్రపడతారు అని అంటున్నారు. చూడాలి మరి వైఎస్సార్ ఫ్యామిలీలో కొత్త తరం వారసుడు రంగ ప్రవేశం చేస్తే ఏ రకమైన రాజకీయ సంచలనం క్రియెట్ అవుతుందో.