ప్రజలకు ఇవ్వాల్సిన నవరత్నాలను ఇచ్చేస్తున్నానని.. బటన్ నొక్కేస్తున్నానని.. తాను సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్ పదే పదే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆయన టైం పెట్టుకుని మరీ బటన్ నొక్కారు. సంక్షేమ పథకాలకు నిర్దేశిత క్యాలెండర్ పెట్టుకుని జనాలకు సొమ్ములు ఇచ్చారు. కానీ.. ఇదే సరిపోతుందా? అంటే.. చాలదన్న విషయం గత ఎన్నికల్లోనే జగన్‌కు తెలిసి వచ్చింది. ఆయన ఎన్ని పథకాలు అమలు చేసినా.. ప్రజలు చిత్తుగా ఓడించారు.
దీనికి ప్రధాన కారణం.. ప్రజల మనసులు గెలుచుకోలేక పోవడమే. అంతేకాదు.. సమయానికి తగిన విధంగా స్పందించలేకపోవడం కూడా జగన్‌కు మైనస్ అయింది. ఈ పరిణామాల నుంచి ఆయన పాఠాలు నే ర్చుకున్నారో లేదో చూడాలి. ఇదిలావుంటే.. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరం ప్రజల మధ్యకు వస్తున్నారు. గత పదిహేను రోజుల హిస్టరీని చూస్తే.. చంద్రబాబు ఇంట్లో గడిపిన రోజులు కేవలం 2-4 రోజులు మాత్రమే.
ఇతర సమయం అంతా కూడా.. ఆయన ప్రజల మధ్యే ఉన్నారు. లేదా సచివాలయంలో ఉన్నారు. మంత్రులతో సమావేశాలు.. జీఎస్టీ సభ, ఇతర కార్యక్రమాలు.. అదేవిధంగా దీపావళిని పురస్కరించుకుని.. ఉద్యోగులతో సమావేశాలు ఇలా.. ఆయన నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా పార్టీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేలు, ఎంపీలతోనూ భేటీ అయ్యారు. అటునుంచి అటే.. షెడ్యూల్ లేకపోయినా.. చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. వారిని శాంత పరిచారు.
తాజాగా విజయవాడలోనూ ఆయన అనూహ్యంగా దర్శనమిచ్చారు. నిత్యం బిజీగా ఉండే విజయవాడ బీ సెంట్ రోడ్డులో దీపావళి సందర్భంగా షాపుల్లో తిరిగారు. వినియోగదారులతో ముచ్చటించారు. ఆయన సామాన్యులకు చేరువ అయ్యారు. మా సీఎం అని అనిపించుకునే పరిస్థితికి వచ్చారు. ఇదే ఏ ముఖ్యమంత్రికైనా కావాల్సింది. కేవలం ఇంట్లో కూర్చుని ఎన్ని నిధులు పంచినా.. ప్రయోజనం ఏముంటుంది? ఆ మాటకొస్తే.. జగన్ కంటే ఎక్కువగానే చంద్రబాబు సొమ్ములు ఇస్తున్నారు. అయినా.. జనం నాడిని తెలుసుకునేందుకు ఆయన జనంలోనే ఉన్నారు. ఇది.. వ్యతిరేకతను కూడా తగ్గించే మహా మంత్రమన్న విషయం ఆయనకు తెలుసు. కానీ, జగన్ తెలుసుకోలేకపోవడంతో ఆయన మైనస్ అయ్యారని అంటున్నారు పరిశీలకులు.