మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. కోర్టు ఆదేశాలతో ఆరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐపై ప్రశ్నలు వర్షం కురిపించింది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని సుప్రీంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్ అయ్యారని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ కేసుపై విచారణ జరపిన సుప్రీంకోర్టు సీబీఐకి మూడు ప్రశ్నలు సంధించిందని చెబుతున్నారు. దీంతో సీబీఐకి సర్వోన్నత న్యాయస్థానం ఝలక్ ఇచ్చిందని అంటున్నారు. సంవత్సరాలు తరబడి దర్యాప్తు చేస్తున్న సీబీఐ కేసును సీరియస్ గా తీసుకుందా? లేదా? అన్నది సుప్రీం తెలుసుకోవాలని భావించిందని అంటున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే బెయిలు రద్దుపై ఆలోచన చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇంకా దర్యాప్తు కొనసాగించడం అవసరమని భావిస్తుందా? ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం ఏంటి? వివేకా హత్య కేసు విచారణ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా? లేదా? అన్న మూడు ప్రశ్నలను సుప్రీం సంధించింది. ఈ మూడు ప్రశ్నలపై ముందుగా వివరణ ఇవ్వాలని, తదుపరి విచారణలో దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. తమ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాకే నిందితుడు అవినాశ్ రెడ్డి బెయిలు రద్దు పిటిషన్ పై విచారణ చేపడతామని తేల్చిచెప్పింది.
వాస్తవానికి వైఎస్ అవినాశ్ రెడ్డితోపాటు ఈ కేసులో పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిలు మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సీబీఐతోపాటు హతుడి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంలో సవాలు చేశారు. ఈ పిటిషన్ ను సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. అవినాశ్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూర్థా వాదించారు.