ఈ మధ్య కాలంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సౌండ్ ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. ఆమె గతంలో అయితే వరసబెట్టి ట్వీట్లు చేస్తూ ఉండేవారు. అంతే కాదు ఆమె తరచూ మీడియా ముందుకు వచ్చేవారు. విమర్శలు కూడా పదునుగా చేసేవారు. అయితే ఆ విమర్శలలో ఎక్కువగా తన సోదరుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీదనే ఎక్కువగా ఉండేవన్న ప్రచారమూ ఉంది. అయితే ఇటీవల కాలంలో షర్మిల తన వ్యూహం మార్చి కూటమి మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు. కానీ ఇపుడు ఎందుకో సైలెంట్ అయ్యారు అని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఏపీలో కొన్ని ఇష్యూస్ ని తీసుకుని వైసీపీ జనంలోకి వెళ్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం మీద వైసీపీ కోటి సంతకాల సేకరణ చేపడుతోంది. అలాగే కల్తీ లిక్కర్ విషయంలో కూడా తన గొంతుని వినిపిస్తోంది. అది కాస్తా వైసీపీ వైపే రావడంతో ఆ పార్టీ ఇబ్బందులో పడింది. అది వేరే విషయం అనుకున్నా వైసీపీ వాయిస్ అయితే జనంలోకి పోతోంది. ఎంతో కొంత ఆ పార్టీ ఉందనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ నుంచి ఎక్కడా సౌండ్ రావడం లేదేమిటి అన్నదే చర్చగా ఉంది.
ఏపీలో రాజకీయం అయితే కూటమి జోరుతో ఏకపక్షంగానే దాదాపుగా సాగుతోంది. అధికారంలోకి వచ్చి పదహారు నెలలు మాత్రమే కావడంతో కూటమిలో ఆ స్పీడ్ అయితే ఉంది. పధకాలు మెల్లగా ఇస్తున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంతో జనాలు కూడా అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం మీద నెగిటివిటీ అయితే పెద్దగా లేదని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురూ జనంలో ఉంటూ వస్తున్నారు. దాంతో కూటమి పట్ల అయితే వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇక షర్మిల విషయం తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె జోరు పెంచారు. ఏపీ అంతా తిరిగారు. ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టినా వైసీపీ ఓటమి కోరుకున్నారు కాబట్టి అక్కడికి సక్సెస్ అయ్యారు అని అనుకోవాలి. ఓటమి తరువాత కూడా ఆమె స్పీడ్ ని అలాగే కంటిన్యూ చేసారు. అయితే ఆ మధ్యనే షర్మిల కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. అలాగే పాతిక మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. దాంతో పార్టీలో సమిష్టి బాధ్యతలు అన్నట్లుగా అంతా కనిపిస్తున్నారని చెబుతున్నారు.
ఇక ఏపీలో చూస్తే కూటమి అధికారంలో ఉంది, విపక్షంలో వైసీపీ ఉంది. కాంగ్రెస్ కి ఊపు రావాలీ అంటే జాతీయ రాజకీయాల్లోనే మార్పు రావాలన్నది కూడా షర్మిల ఆలోచిస్తున్నారు అని అంటున్నారు బీహార్ ఎన్నికల మీద కాంగ్రెస్ వాదులు అంతా ఆశ పెట్టుకున్నారు అని అంటున్నారు. అక్కడ నవంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే జాతీయ రాజకీయం మారుతుందని ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడుతుందని లెక్క వేస్తున్నారు అని అంటున్నారు. ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఏపీలో పుంజుకునేందుకు మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. అందుకే షర్మిల సహా కీలక నేతలు అంతా బీహార్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి బీహార్ ఏపీ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో.