ఏపీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరసబెట్టి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. వీరిలో జగన్ కోటరీగా చెప్పుకునే వారే ఉన్నారు. అలా చూస్తే ఈ కేసులో అనేక మంది ముఖ్యులు జైలు పాలు అయ్యారు. ఆ లిస్ట్ చూస్తే కనుక వారంతా జగన్ కి అత్యంత సన్నిహితులుగా కోటరీ మనుషులుగా చెప్పుకుంటారు.
ఇక చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి అదే విధంగా ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి లను ఇప్పటికే అరెస్టు చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు అనుకూలంగా వ్యవహరించిన వారు ఇపుడు జైలులో ఉంటున్నారు.
ఎంపీగా ఉంటూ జగన్ కోటరీలో ఉన్న మిధున్ రెడ్డి అరెస్టు తో ఈ కేసు పీక్స్ చేరుకుందని అంటున్నారు. తన కుమారుడుది తప్పు లేదని జగన్ కి సన్నిహితంగా ఉండడం వల్లనే అరెస్టు చేశారని ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చూస్తే అనేక మంది అరెస్టులు ఇంకా ఉన్నాయా అన్న చర్చకు కూడా తావిస్తోంది. జగన్ కోటరీలో అతి ముఖ్యుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం అరెస్టు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆయన మీద అటవీ భూములను కబ్జా చేశారు అన్న ఆరోపణల మీద ఉన్నారు. అయితే ఆ కేసు లేకపోతే లిక్కర్ స్కాం లో అయినా పెద్దిరెడ్డి అరెస్టు జరగవచ్చు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీలో చక్రం తిప్పుతున్న నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉన్నపుడు సకల శాఖల మంత్రిగా విపక్షాలు ప్రచారం చేసేవి. ఆయన మీద ఏ కేసులో అరెస్టు చేస్తారు అన్నది పక్కన పెడితే అరెస్టు మాత్రం జరగక తప్పదని అంటున్నారు. ఇక లిక్కర్ స్కాం లో చూస్తే కనుక 3,200 కోట్ల అతి పెద్ద కుంభకోణంగా సిట్ తేల్చిందని అంటున్నారు. అంతే కాదు చార్జిషీటులో అనేకసార్లు జగన్ పేరు ప్రస్తావన వచ్చినట్లుగా చెబుతున్నారు. జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో మద్యం పాలసీని తయారు చేశారు అని సిట్ అనుమానిస్తోంది అంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్టు చేసిన సిట్ 13వ వ్యక్తిగా ఎవరిని అరెస్టు చేస్తుంది అన్న చర్చకు తెర లేస్తోంది ఇక చూస్తే కనుక ఈ కేసులో అరెస్టులు అన్నీ కూడా వరసబెట్టి సాగుతూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దాకా వచ్చి ఆగిందని అంటున్నారు. మరి ఈ కేసులో జగన్ అరెస్టు ఉంటుందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ కేసులో అన్ని ఆధారాలు చూసుకున్న మీదటనే జగన్ కి నోటీసు ఇచ్చి విచారణకు పిలిపిస్తారు అని అంటున్నారు. మరి అరెస్టు అన్నది మాత్రం ఎవరి ఆలోచనల మేరకు వారు చెబుతున్నారు. కచ్చితంగా జరిగి తీరుతుందని కూటమి నేతలు అంటున్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర అయితే లిక్కర్ స్కాం విషయం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటికొస్తుంది అని ఆయన సంచలన విషయాలనే బయటపెట్టారు. ఈ కేసులో ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికొచ్చాయని ఆయన అన్నారు. ఇక ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంగా ఆయన అభివర్ణించారు రవీంద్ర చెబుతున్న దానిని బట్టి చూస్తే ఆ అతి పెద్ద తిమింగళం ఎవరు ఏమిటి అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.