2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల పైగా సమయం ఉన్నా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే తన వ్యూహాలను సిద్ధం చేయడం ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంట్ ఇంచార్జీల సమావేశంలో జగన్ కీలక ప్రకటన చేశారు. 2027లో మరోసారి పాదయాత్ర చేస్తానని, ఆ పాదయాత్ర ద్వారా 2029లో విజయం సాధించడం లక్ష్యమని స్పష్టంగా వెల్లడించారు.
2019లో సీఎం కుర్చీకి ఆయనను చేర్చిన పాదయాత్ర తాలూకు గుర్తులు జగన్‌లో ఇంకా ఉండగా, ఇప్పుడు అదే తీరులో 2027లోనూ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గుడివాడ అమర్నాథ్ చేసిన జగన్ 2.0 పాదయాత్ర ప్రకటన నిజమేనని తేల్చేశారు. 2014లో చంద్రబాబు విఫల హామీలు, 2019లో తన పాదయాత్రలో ప్రస్తావించిన దానితో ప్రజలు వైసీపీకి ఓటేశారని గుర్తుచేసిన జగన్, ఇప్పుడు కూడా ఆ తరహా పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఈసారి పాదయాత్ర మరింత వ్యూహాత్మకంగా ఉంటుందని, అందుకు సంబంధించిన క్లారిటీ వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీలో ప్రకటిస్తానని తెలిపారు. 2029లో గెలిచే మార్గాన్ని ఇప్పుడే సెట్ చేసుకోవాలని, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్లీనరీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇంచార్జీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు తమ పరిధిలోని నియోజకవర్గాల విజయాల ఆధారంగా ప్రాధాన్యం పొందుతారని జగన్ తేల్చిచెప్పారు. కార్యకర్తలే ఈసారి ప్రధానంగా ఉంటారని చెప్పి, నేతలకు మరింత చైతన్యం కలిగించేలా సూచనలు ఇచ్చారు. 2027 పాదయాత్ర, 2029 విజయం కోసం జగన్ వేయనున్న అడుగులు రాజకీయంగా భారీ చర్చకు దారితీసే అవకాశముంది.