ఇప్పుడు ఇండియా వైడ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయ రంగం ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఎన్డీఏ తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రకటించగా, ఇండియా కూటమి తెలంగాణకు చెందిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపడం హైలైట్‌గా మారింది. వీరిద్దరి మధ్య పోటీ దక్షిణాది ప్రాతిపదికగా ఎలా సాగుతుందో అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి గెలుస్తారా..? లేక ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధిస్తారా ..? అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు నుంచి రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడంతో డీఎంకే ఇబ్బంది పడుతుండగా, ఇండియా కూటమి తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థిని ఎంచుకోవడం ద్వారా ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీని ఇబ్బందుల్లో పడేయాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పేరు హైలైట్‌గా మారింది. స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరడం పెద్ద హైలైట్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీకి లోకసభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు—మొత్తం 11 మంది ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ అధికారికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కానీ, ప్రతిపక్ష ఇండియా కూటమిలో కానీ భాగం కాకపోయినా, రాష్ట్రంలో దాని ప్రత్యర్థి అయిన టీడీపీ మాత్రం ఎన్డీఏ కీలక మిత్రపక్షంగా ఉంది. కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని భావిస్తున్నారు.
అయితే వైసీపీ నిర్ణయంపై ఇప్పుడు కొందరు జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. కానీ ఆయన ఇప్పుడే కాదు, గతంలో కూడా గెలిచే అభ్యర్థినే మద్దతు ఇస్తూ వచ్చారు. ఆ స్ట్రాటజీని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తన మద్దతును తమిళనాడుకు చెందిన సి.పి. రాధాకృష్ణన్‌కే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విజయం ఆల్ మోస్ట్ ఆల్ ఖరారైనట్లే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణల వల్ల చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేస్తూ జగన్ పోరాటం చేస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. 2029 ఎన్నికల వ్యూహంలో భాగంగా జగన్ ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపు ఉండడం, ఈ లెక్కలు భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు కీలకమవుతాయని జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమేనని స్పష్టమవుతోంది..!