వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతి ఇప్పటి వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడటం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు, 2019 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె సొంతగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పులివెందులలో బంధువర్గం, పార్టీ ముఖ్యనేతలతో ఎప్పుడన్నా ఒకసారి మాట కలిపేవారు. మిగతా ‘బిజినెస్’ వ్యవహారాలు తప్ప రాజకీయాల గురించి ఆమె పార్టీ నేతలతో చర్చించిన దాఖలాలు లేవు. కానీ గత కొద్ది రోజులుగా భారతి యాక్టివ్ అయిపోయారు.
పార్టీ నాయకులతో మాటలు కలుపుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది? పార్టీలో ఎవరెవ రు ఏం చేస్తున్నారు? మనం ఏమి చేయాలంటూ ఆమె ఆరా తీస్తున్నారు. భారతి ‘సడెన్ ఎంట్రీ’ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ‘బిజినెస్’ వ్యవహారాల్లో ఆమె అత్యంత జాగ్రత్తగా ఉన్నట్టుగా, ఇప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో ఆ నియమాలే పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయనకు సెల్‌ఫోన్ లేదు. భారతి దగ్గర కూడా సెల్‌ఫోన్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. మూడు రకాల పద్ధ్దతుల్లో పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు. ఫోన్‌లోనూ మాట్లాడుతున్నారు. కానీ తన ఫోన్‌నుంచి మాత్రం కాదు. జగన్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉంటు మద్యం కేసులో చిక్కుకున్న ఓ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచే ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు. అదే పార్టీలో మద్యస్థాయి నేతలతో సంప్రదించాల్సి వచ్చినప్పుడు మరో పంథా అనుసరిస్తున్నారు. ఎవరో ఒక నాయకుడిని తన వద్దకు పిలిచి.. ‘మేడం గారు ఇక్కడే ఉన్నారు. మీతో ఇలా చెప్పమన్నారు’ అని మాట్లాడిస్తున్నారు. అవసరమైతే ఆమె కూడా మాట్లాడుతారు. మరీ కింది స్థాయి వారయితే, ఆ పార్టీ జిల్లా నేతలు వెళ్లి ఆమె తరఫున వారితో మాట్లాడుతున్నారు. కొందరు వైసీపీ నేతల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఆమె ప్రస్తుతానికి వైసీపీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది లేదు. ‘ఉద్యమించండి, ధర్నాలు చేయండి’ అని అందరికీ చెప్పి ఆయన బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కూడా ఆయన దూరం పెట్టేశారు. దీంతో పార్టీ నేతలకు, ఆయనకు మధ్య అగాథం పెరుగుతోంది. కార్యకర్తలతో సరేసరి. నాయకుడు లేకుండా పోరాటాలు ఏమిటో కేడర్‌కు అర్థం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా జగన్ మాత్రం ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు చెప్పేవారు లేరు. ఒకవేళ ఆయనకు చెప్పినా పట్టించుకోలేరు. ఇటీవలి కాలంలో చేపట్టిన పలు ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు విఫలమయ్యాయి. మొన్నటికి మొన్న యూరియా, మెడికల్ కాలేజీల విషయంలో ఆర్భాటం చేసినా ఆ తర్వాత తుస్సుమనిపించారు.
జిల్లా, క్షేత్రస్థాయి నాయకులకు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. జగన్‌కు ఆత్మగా చెప్పుకొనే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌లు పెట్టి సమస్యలను మరింత జఠిలం చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని సద్దుమణచడానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్దికాలానికే పార్టీ తెరమరుగవుతుందన్న కొందరి నేతల అభిప్రాయాలతో భారతి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. జగన్ కార్యకాలాపాలు ఎలా ఉన్నప్పటికీ, పార్టీ నేతలను ప్రత్యక్షంగా సమన్వయపరిచే బాధ్యతలను ఆమె తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ తప్పదా? అంటూ రకరకాల ఊహగానాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి కదలికా లేదు. కానీ జగన్, ఆయన శిబిరం మాత్రం ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతి ఎంట్రీ చర్చనీయాంశంగా మారింది. ఆమె నేరుగా పార్టీ క్రియాశీల కార్యకలాపాల్లోకి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పటి వరకు ఆమె అతి కొద్దిమందితోనే మాట్లాడారని తెలుస్తోంది. సమాచారం బయటకు పొక్కకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిసింది.