చిన్న, మధ్య స్థాయి యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే భారతదేశంలో యూట్యూబ్ ఇటీవల హైప్ (YouTube Hype) అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది కంటెంట్ క్రియేటర్లకు వారి ఛానెల్‌ను విస్తరించడానికి, కొత్త ప్రేక్షకులను చేరుకోవడానికి, ఆదాయాన్ని పెంచుకోవడానికి సరికొత్త అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రధానంగా 500 నుంచి 5,00,000 సబ్‌స్క్రైబర్లు కలిగిన సృష్టికర్తలకు వర్తిస్తుంది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైప్ అనేది యూట్యూబ్‌లో ఒక కొత్త ఎంగేజ్‌మెంట్ ఫీచర్. ఇది వీక్షకులు తమకు ఇష్టమైన వీడియోలను హైప్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ బటన్‌లతో పాటు మరో కొత్త సపోర్ట్ ఆప్షన్ ఇస్తోంది. ప్రస్తుతం చిన్న కంటెంట్ సృష్టికర్తలకు కొత్త ప్రేక్షకులను చేరుకోవడం తరచూ సవాలుగా మారుతుంది. అలాంటి వారు ఈ హైప్ ఫీచర్ ద్వారా వ్యూస్ పెంచుకోవచ్చు.
వీడియో పబ్లిష్ అయిన మొదటి ఏడు రోజుల్లో వీక్షకులు హైప్ బటన్‌ను క్లిక్ చేయవచ్చు. దీని ద్వారా వీడియోకు పాయింట్లు లభిస్తాయి. ఈ పాయింట్లు మీ వీడియోను యూట్యూబ్ ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని టాప్ 100 హైప్ వీడియోల లీడర్‌బోర్డ్‌లో ర్యాంక్ పొందేలా చేస్తాయి.
హైప్ ఫీచర్ చిన్న సృష్టికర్తలకు సమానమైన అవకాశాన్ని అందిస్తుంది. తక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న సృష్టికర్తలకు ఎక్కువ బోనస్ పాయింట్లు లభిస్తాయి. దీని వల్ల వారి వీడియోలు లీడర్‌బోర్డ్‌లో ఎక్కువ ర్యాంక్‌కు చేరుకుంటాయి. ఉదాహరణకు 500 సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానెల్‌కు ఒక హైప్‌కు ఎక్కువ బోనస్ పాయింట్లు లభిస్తాయి. ఇది 4,00,000 సబ్‌స్క్రైబర్ల ఛానెల్‌తో పోలిస్తే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
ఈ సమాన అవకాశం చిన్న సృష్టికర్తలకు పెద్దస్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని అందిస్తుంది. లీడర్‌బోర్డ్‌లో ఉన్నత స్థానం పొందిన వీడియోలు యూట్యూబ్ హోమ్ ఫీడ్‌లో ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా కొత్త వీక్షకులు చేరుకుంటారు, ఛానెల్ వేగంగా వృద్ధి చెందుతుంది.
హైప్ ఫీచర్ వీక్షకులకు తమకు ఇష్టమైన క్రియేటర్లకు సపోర్ట్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ క్రమంలో ఒక క్రియేటర్ వారానికి మూడు వీడియోలను ఉచితంగా హైప్ చేసుకోవచ్చు. ఈ చర్య వీడియోకు పాయింట్లను అందిస్తుంది. ఇది లీడర్‌బోర్డ్‌లో ర్యాంక్‌ను మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ వీక్షకులు తమకు ఇష్టమైన కంటెంట్‌ను ఎంచుకునే విధంగా ప్రత్యక్ష అభిప్రాయాన్ని అందిస్తుంది. ఇది సృష్టికర్తలకు బ్రాండ్‌ను పెంచడంతోపాటు వీక్షకుల సపోర్ట్ కూడా ఛానెల్ విజయానికి దోహదపడుతుంది.
హైప్ చేయబడిన వీడియోలు కొన్నిసార్లు ప్రత్యేక బ్యాడ్జ్‌లను పొందుతాయి. ఇది క్రియేటర్లను మంచి కంటెంట్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఫలితంగా ప్లాట్‌ఫామ్ అంతటా కంటెంట్ నాణ్యత పెరుగుతుంది. ఎక్కువ వీక్షణలు ఎంగేజ్‌మెంట్ వల్ల ప్రకటన ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతోపాటు హైప్ ఫీచర్ చిన్న సృష్టికర్తలకు వారి ప్రేక్షకులు ఏ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవడానికి డేటాను కూడా అందిస్తుంది.