దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ఎన్డీయేలోని మిత్రులకు తగిన గౌరవం ఇవ్వడం ద్వారా వారు తమతో ఉండేలా మంచి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇచ్చి పుచ్చుకోవడం ద్వారానే ఎన్డీయే బంధం పదికాల పాటు పదిలంగా ఉంటుందని మోడీ బలంగా నమ్ముతున్నారు. దాంతో ఆయన దేశంలో చాలా రాష్ట్రాలలో పర్యటించేటపుడు మిత్రులకు తగిన ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు.
నరేంద్ర మోడీ వయసు డెబ్బై అయిదు నిండి డెబ్బై ఆరులోకి మళ్ళింది. ఆయన తన సమకాలీనులకు ఎంతో విలువ ఇస్తారు. వారితో కలసి వేదికలు పంచుకుంటారు, అనుభవాలను నెమరేసుకుంటారు. అదే సమయంలో ఆయన ఎక్కువగా యువతరంతో కలసి ప్రయాణించేందుకు ఇష్టపడతారు అని అంటారు. ఆయన సంఘ్ నుంచి వచ్చిన వారు, అలాగే బీజేపీ ఆలోచనలు నిండా నింపుకున్న వారు. ఈ వ్యవస్థలు ఎపుడూ కొత్త తరాన్ని యువతను నమ్ముతాయి. ఆ విధంగా ఆలోచిస్తే మోడీ కూడా దేశంలోని వివిధ రాష్ట్రాలలో యువతరం నాయకులను ఎక్కువగా ప్రోత్సహిస్తూంటారు.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర మంత్రిగా ఉన్న ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చురుకైన నేత. ఆయనకు మోడీ ఎంతో చేయూత ఇస్తారు. నిజానికి ఎన్డీయేలో చిరాగ్ పాశ్వాన్ కొనసాగడానికి మోడీ ఒక ప్రధాన కారణంగా చెబుతారు. యువకుడు అయిన చిరాగ్ తో మోడీ ఎంతో బాగా ఉంటారు. ఆయన తండ్రి దిగ్గజ నేత కేంద్ర మంత్రిగా పలు మార్లు పనిచేసిన రాం విలాస్ పాశ్వాన్ ని కూడా మోడీ ఎంతో గౌరవించేవారు. ఇపుడు తనయుడితో కలసి ప్రభుత్వం నడుపుతున్నారు. అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో యువతకు ముఖ్యమంత్రుల పదవులు దక్కాయి. మహారాష్ట్రలో యువనేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయిన సంగతి తెలిసిందే. హర్యానాలోనూ అదే జరిగింది. ఇలా బీజేపీలో కొత్త తరాన్ని ముందుకు తెస్తున్నారు.
ఇక దక్షిణాదిన చూస్తే మోడీ తమిళనాడులో నాలుగు పదులు వయసు ఉన్న బీజేపీ నేత అన్నామలైని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆయన చాలా కాలం పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కర్ణాటకలో బీజేపీకి యువ నేతలు చాలా మంది ఉన్నారు. మిత్ర పార్టీ జేడీఎస్ నుంచి కేంద్ర మంత్రి కుమారస్వామి తనయుడిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణాలో అదే జరుగుతోంది. బండి సంజయ్ వంటి వారికి ఆ విధంగానే అవకాశాలు దక్కాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ల మీద మోడీ ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. రేపటి తరానికి వీరే వారధులు సారధులు అన్నది మోడీ భావన అని చెబుతారు. చంద్రబాబు అపార అనుభవం ఉన్న నాయకుడు అయినా కాల గమనంలో కొత్త తరం రావడం అనివార్యం కాబట్టి వారితో మోడీ ముచ్చట్లు పెడుతూ సరదాగా మాట్లాడుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారని అంటున్నారు. మొత్తం మీద మోడీ ఆలోచనలు ఆయన ఆకాంక్షలు ఆశయాలు అర్ధం చేసుకున్న యువ నేతలు రానున్న రోజులలో బాగానే రాణించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.