రాజకీయాలలో చాన్సు అన్నది సాధారణంగా ఎవరూ ఇవ్వరు. పట్టుదలగా శ్రమించి తీసుకోవాలి. కొన్ని సార్లు అవతల వారు చేసే చర్యల మూలంగా చాన్సులు అలా వస్తూ ఉంటాయి. వాటిని తీసుకునే దానిని బట్టే ఇవతల పక్షం రాజకీయంగా ఎదగడం అన్నది ఉంటుంది. ఏపీలో చూస్తే కాంగ్రెస్ ని దెబ్బ కొట్టి వైసీపీ ఆవిర్భవించింది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చినదే. అలా వైసీపీ ఏపీలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా స్థిరపడింది అయితే వైసీపీ అధినాయకత్వం వరుసగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మూలంగా వైసీపీ ఇబ్బంది పడుతోంది.
వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన ట్రెడిషనల్ ఓటు బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్ బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం రైట్ వింగ్ విధానాలకే మద్దతుగా నిలుస్తోంది. అంటే కుడి భావజాలం కలిగిన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. దానికి వైసీపీ చెబుతున్న లాజిక్ అయితే ఎక్కడా సరిపోవడం లేదు అని అంటున్నారు. కాంగ్రెస్ తో తమకు జాతి వైరం కాబట్టి బీజేపీకి మద్దతు అన్నది కూడా అంతగా అతికినట్లుగా లేదని అంటున్నారు. కాంగ్రెస్ వద్దు అనుకుంటే బీజేపీ మాత్రం ఎందుకు ముద్దు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇక చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ వెంట కాంగ్రెస్ వరాలు అనుసరించాయి. అలా హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ కూడా వైసీపీకి పెట్టని కోటగా మారింది. ఎస్సీలు, ఎస్టీలు మైనారిటీలు ఒకనాడు కాంగ్రెస్ కి బలమైన ఓటర్లుగా ఉన్నారు. కానీ కాలం కలసిరాక ఏపీలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. పదేళ్ళ తరువాత తెలంగాణాలో ఏదో విధంగా అధికారం సంపాదించుకున్న కాంగ్రెస్ కి ఏపీలో మాత్రం పట్టు చిక్కడం లేదు. మూడు వరస ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బ తినిపోయింది.
వైసీపీలో ఉన్న కీలక వర్గాలకు బీజేపీతో అసలు పడదనే అంటారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ప్రతీ విషయంలో మద్దతుగా ఉండడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారని అంటున్నారు. అయితే వారికి వేరే ఆల్టర్నేషన్ లేకుండా ఉందని చెబుతున్నారు ఈ వర్గాలు తెలుగుదేశం వ్యతిరేక రాజకీయ పంధాను ఎంచుకున్నాయి. అందుకే ఇపుడు కాంగ్రెస్ గట్టిగా నిలబడితే మాత్రం ఈ వర్గాలు తిరిగి తమ మాతృ సంస్థ వైపు చూసే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ ని రేసులో నిలిపే ధీటైన నాయకత్వమే ఇపుడు కావాల్సి ఉందని అంటున్నారు. అది జరిగిన నాడు వైసీపీకి ఇబ్బంది తప్పదని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత బద్ధంగా పనిచేయాల్సి ఉంటుందని నేల విడిచి సాము చేస్తే జాతీయ పార్టీలు అయినా ప్రాంతీయ పార్టీలు అయినా ఇబ్బందులు పడతాయని చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని అంటున్నారు.