సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా వైసీపీ ఆశలకు వ్యూహాలకు గట్టి దెబ్బనే కాంగ్రెస్ వేసింది అని అంటున్నారు. నిజానికి చూస్తే ఈ ఆగస్టులో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరుతారు అని ప్రచారం అయితే సాగింది. బెంగళూరులో ఉన్న జగన్ తో కొంతమంది నేతలు నేరుగా మాట్లాడి వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు అని కూడా ప్రచారం సాగింది. రాయలసీమ నుంచి కోస్తా గోదావరి జిల్లాల దాకా ఉన్న సీనియర్లు కీలక నేతలు ఇక వైసీపీలోకి క్యూ అన్న వార్తలు అయితే ఆ మధ్య దాకా పెద్ద ఎత్తున హల్ చల్ చేశాయి.
అయితే సకాలంలో కాంగ్రెస్ మేలుకొంది అని అంటున్నారు. జాతీయ కాంగ్రెస్ నేతలు ఏపీ మీద చాలా కాలంగా దృష్టి పెట్టడం లేదు అన్నది కూడా ఉంది. మరో వైపు షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం మీద చాలా మంది సీనియర్లలో అసంతృప్తి ఉంది అని అంటూ వచ్చారు. ఆమె సైతం సీనియర్లను కలుపుకుని పోవడం లేదని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ కి సమూలమైన ప్రక్షాళనకు కాంగ్రెస్ పెద్దలు పూనుకున్నారు. దాంతో షర్మిలకు కుడి ఎడమలుగా ఇద్దరు సీనియర్లు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చారు. ఇక మొత్తం సీనియర్లను అందరినీ ఒక చోటకు చేర్చి ఏకంగా పాతిక మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. దాంతో అనేక మంది ఇపుడు క్రియాశీలకంగా కనిపిస్తున్నారు.
ఇక వైసీపీ మీద ఒంటి కాలు మీద లేచి విమర్శలు ధాటీగా సంధించే షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది అంటే వారికి ఏపీ రాజకీయ పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది అని అంటున్నారు. వైసీపీ నుంచి ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలీ అంటే కచ్చితంగా షర్మిల కాంగ్రెస్ లో ఉండాల్సిందే అన్న కాంగ్రెస్ పెద్దల నిర్ణయం వ్యూహాత్మకం అని అంటున్నారు. అదే సమయంలో షర్మిలను సింగిల్ గా కాకుండా మొత్తం సీనియర్లతో కలిపి సమిష్టి నాయకత్వంతో పనిచేసేలా పార్టీని రెడీ చేసి పెట్టారు.
ఇక ఇదే సమయంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ పేల్చిన అణు బాంబు లాంటి ఓట్ల చోరీ వ్యవహారం బాగా పేలింది. ఇది దేశవ్యాప్తంగా అతి పెద్ద చర్చకు దారి తీసింది దాంతో ఏపీలో కూడా కాంగ్రెస్ మీద చర్చ అయితే సాగుతోంది. దేశంలో మూడు టెర్ములుగా మోడీ అధికారంలో ఉన్నారు అనేక రాష్ట్రాలలో బీజేపీ వరసగా గెలుస్తోంది. అయితే దీని వెనక ఓట్ల చోరీ ఉందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు మాత్రం జనాలు ఎంత మేరకు నమ్ముతున్నారు అన్నది పక్కన పెడితే చర్చకు మాత్రం ఆస్కారం ఇచ్చాయని అంటున్నారు. దాంతో తొలిసారిగా ఏపీలో కూడా రాహుల్ గాంధీ ఫోకస్ ఎక్కువ అయింది అంటున్నారు. ఇక రాహుల్ ఓట్ అధికార్ యాత్ర సాగనుంది. అది హిట్ అయి రేపటి రోజున బీహార్ లో కనుక కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం దాని ప్రభావం తప్పకుండా ఏపీ మీద పడుతుందని అంటున్నారు. మొత్తం మీద వైసీపీని ఇరుకున పెట్టే విధంగా కాంగ్రెస్ ఏపీలో మళ్ళీ దూకుడు చేయడానికి అన్ని రకాలైన అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంది అని అంటున్నారు.