నానాటికి తీసి కట్టుగా వైసీపీ రాజకీయాలు మారుతున్నాయి. ఇది ఎవరో అంటున్న మాట కాదు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎంతో కొంత సానుభూతి ఉన్న కీలక మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. ఆయన కూడా నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడే కావడం విశేషం. ఆయన తాజాగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ ”మా పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతుంది. మా నాయకుడు జారుడు బండపై ప్రయోగాలు చేస్తున్నారు” అని వ్యాఖ్యలు చేశారు
దీనిని బట్టి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వైసిపి ఏ విధంగా దిగజారిపోయింది.. అనేది స్పష్టం అవుతుంది. పార్టీ పరంగా ఇది ఒక సరిదిద్దుకోలేని పెద్ద వివాదంగా కూడా మారింది. ఒక్క విడతలో ఏడాదికాలంగా సంపాదించుకున్న సింపతీ రప్పా రప్పా వ్యాఖ్యలతో కొంత పోగా.. ఇక మిగిలింది కూడా నల్లపరెడ్డి వ్యాఖ్యలతో తుడిచిపెట్టుకుపోయింది. కూటమిలోని మంత్రులు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా విరుచుకుపడ్డారు. ఎక్కడ విన్నా.. ఏం ఛానల్ చూసినా వారు చేస్తున్న విమర్శలు, వారు చేస్తున్న వ్యాఖ్యలతో వైసిపి పై తీవ్ర దుమారం రేగింది.
ఈ పరిణామాలు చూసే బహుశా సీనియర్ నాయకుడు సొంత పార్టీ అయినప్పటికీ మనసులో ఉన్న మాట బయటికి చెప్పారు. ”ఇది వాస్తవం. నల్లపరెడ్డిని ఇప్పుడు మీరు సమర్ధించుకుంటూ పోతే రేపు భవిష్యత్తులో మరింత మంది నల్లపురెడ్డిలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని” ఆయన వ్యాఖ్యానించారు. ఇది అంతర్గతంగా ఆయన వ్యాఖ్యానించినప్పటికీ పార్టీ ప్రమాదకర స్థితిలో ఉన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు జగన్ నేరుగా రంగంలోకి దిగి వాటిని ఖండించడమో లేక తప్పు పట్టడమో చేయాలి.
నాయకులపై చర్యలు తీసుకొని ఉండాల్సింది. కానీ, అమరావతి మహిళలపై సొంత చానల్లో వ్యక్తులు వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన బయటికి రాలేదు. ఇప్పుడు సొంత పార్టీ నాయకుడు, సీనియర్ నేత ఒక మహిళ ఎమ్మెల్యే పై, అందునా నిన్నటి దాకా ఇదే పార్టీలో ఉన్నటువంటి నాయకుడి సతీమణి పై వ్యాఖ్యలు చేయడం పట్ల, వీటిని జగన్ ఖండించకపోవడం పట్ల సమాజంలో వైసిపి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనేది వాస్తవం. ఇలాంటి వ్యాఖ్యలను, ఇలాంటి విమర్శలను జగన్ చూస్తూ కూర్చుంటే మహిళా ఓటు బ్యాంకు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పుడు బాగానే ఉన్నా ఎన్నికల సమయానికి ఇవన్నీ పెద్ద రచ్చగా మారితే ఆనాడు వైసిపి సరిదిద్దుకోలేని తప్పులు చేసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్ ఈ విషయాలపై బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తన వాదనని వినిపించి తప్పు చేసిన వారిపై సస్పెన్షన్ విధించడం లేక మరో రూపంలో చర్యలు తీసుకోవడం చేయడం ద్వారా పరిస్థితిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆయన అలా చేయకపోవడంతోనే సీనియర్ నాయకులు సైతం వైసీపీ అంటే దూరంగా ఉంటున్నారు. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా.. జగన్ ఇంకా మారడా.. అనేది కాలమే నిర్ణయించాలి. మరొకసారి గనక పరాజయం ఏర్పడితే ఇక వైసిపి ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు అన్నది ఆయన నాయకుడు చెప్పిన మాట.