సాయుధ దళాలలో నారీ శక్తికి సంబంధించిన ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… భారత సైన్యం పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా టెరిటోరియల్ ఆర్మీ (టీఏ)లోకి మహిళా కేడర్లను చేర్చుకోవడాన్ని పరిశీలిస్తోందని.. ప్రారంభంలో ఎంపిక చేసిన కొన్ని బెటాలియన్లకే నియామకాలు పరిమితం చేయబడతాయని నివేదికలు చెబుతున్నాయి. వీటిని అధికారులు ధృవీకరించినట్లు తెలుస్తోంది.
అవును… టెరిటోరియల్ ఆర్మీ చట్టం కింద ఆగస్టు 18, 1948లో ప్రస్తుతం ఉన్న టెరిటోరియల్ ఆర్మీ స్థాపించబడగా.. 1949 అక్టోబర్ 9న భారతదేశ చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారిచే ఇది అధికారికంగా ప్రారంభించబడింది. అయితే ఇందులో ఇప్పటివరకూ మహిళలకు ప్రవేశం లేదు! ఈ నేపథ్యంలో… ఇకపై ఈ టీఏలోకి మహిళా కేడర్లను చేర్చుకోనున్నారని తెలుస్తోంది.
సాయుధ దళాలలో నారీ శక్తిని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఇది ఓ కీలక అడుగని అంటున్నారు. ఈ టెరిటోరియల్ ఆర్మీ.. సాధారణ ఆర్మీ నమోదుకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్వచ్ఛంద సేవకులను యూనిఫాంలో దేశానికి సేవ చేయడానికి, సైన్యం సంస్థాగత అవసరాలను పెంచడానికి అనుమతిస్తుంది.
ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో సుమారు 50వేల మంది సిబ్బంది ఉండగా.. వీరిలో రైల్వే, ఐఓసీ, ఓఎన్జీసీ, నాన్ డిపార్ట్మెంటల్ టీఏ యూనిట్లు వంటి 65 డిపార్ట్మెంటల్ టీఏ యూనిట్లు ఉన్నాయి. వీటిలో హోం & హార్త్ బెటాలియన్, వివిధ ఇన్ ఫ్రాంట్రీ రెజిమెంట్ లకు అనుబంధంగా ఉన్న ఎకోలాజికల్ బెటాలియన్, లైన్ ఆఫ్ కంట్రోల్ ఫెన్సింగ్ నిర్వహణ కోసం ఇంజనీర్ రెజిమెంట్ (టీఏ) ఉన్నాయి.
ఈ టీఏ యూనిట్లు 1962, 1965, 1971 ఆపరేషన్ లలో పాల్గొన్నాయి. శ్రీలంకలో చేపట్టిన ఆపరేషన్ పవన్.. పంజాబ్, జమ్మూ కశ్మీర్ లలోని ఆపరేషన్ రక్షక్.. ఈ శాన్యంలోని ఆపరేషన్ రైనో, ఆపరేషన్ బజరంగ్ లలో చురుకైన పాత్రలు పోషించాయి.
కాగా… ప్రస్తుతం మహిళలు 10 ఆయుధ, సర్వీస్ లలో నియమితులయ్యారు. ఇందులో భాగంగా… కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్, ఇంటెలిజెన్స్ కార్ప్స్, ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్, ఆర్మీ మెడికల్ సర్వీసెస్ లు ఉన్నాయి.












