ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి ఈ విధంగా రెండింటినీ పోటాపోటీగా చూసి మరీ అమలు చేస్తోంది. ఇందుకోసం లక్షలలో ఖర్చు చేస్తోంది. అసలే ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. విభజన వారసత్వంగా వచ్చిన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అయినా పంటి బిగువున ఓర్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఏపీలో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఇంత చేస్తున్నా పాజిటివిటీ రావలసిన దాని కంటే తక్కువగానే వస్తోంది అన్నది కూటమి పెద్దల ఆవేదనగా ఉంది.
ఏపీలో చాలా కాలం తరువాత ఏకంగా 17 వేల టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేశారు. దీని కోసం సభ కూడా నిర్వహించి నియామక పత్రాలు అందించారు. సారిగ్గా అదే సమయంలో అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద టోటల్ మీడియా ఫోకస్ వెళ్ళిపోయింది. దాంతో మెగా డీఎస్సీకి రావాల్సిన పబ్లిసిటీ రాలేదన్న వేదన ఉంది. అదే విధంగా ప్రభుత్వం ఉచిత బస్సు పధకం అమలు చేస్తోంది. ఆటో డ్రైవర్లకు వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలను ఇటీవలనే వేశారు. అలాగే ప్రతీ నెలా పెన్షన్లు పెద్ద ఎత్తున ఇస్తున్నారు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
అదే విధంగా అమరావతి రాజధాని ప్రగతి గతి కూడా జోరుగా సాగుతోంది. ఈ మధ్యనే అద్భుతంగా సీఆర్డీఏ భవనాలు రెడీ అయి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం జరుపుకున్నాయి. వచ్చే ఏడాది మరి కొన్ని ప్రారంభం అవుతున్నాయి. ఇక దశల వారీగా అమరావతి రాజధాని అభివృద్ధి సాధిస్తోంది. అదే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ కూడా పరుగులు తీసేలా ప్రగతి సాధిస్తోంది. అయితే వీటి మీద పెద్దగా ప్రచారం కానీ చర్చలు కానీ లేకుండా పోతున్నాయని టీడీపీ కూటమి పెద్దలు ఆందోళన పడుతున్నారు.
అమెరికా నుంచి బయట దేశాలలో ఎక్కడా పెట్టని విధంగా అతి పెద్ద పెట్టుబడి దేశంలో పెట్టింది గూగుల్. అంతే కాదు దానిని ఏపీని తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అయితే దాని మీద కూడా చర్చ సాగకుండా కల్తీ లిక్కర్ మీద డిబేట్లు పెడుతున్నారు. అందులో టీడీపీ నేతలు పాల్గొంటూ దాని మీదనే సవాళ్ళు చేస్తున్నారు. ఇక మీడియా సమావేశం పెట్టి మరీ మరి కొందరు ఈ ఇష్యూ మీద అతి ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో ఎంతో కష్టపడి సాధించిన గూగుల్ డేటా సెంటర్ మీద అనుకున్న విధంగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని టీడీపీ పెద్దలు మధనపడుతున్నారుట.
అందుకే ఇక మీదట కల్తీ మద్యం మీద చర్చలు కానీ మీడియా మీటింగులు కానీ వద్దని ఒక దిశా నిర్దేశంతో కూడిన ఆదేశం అయితే పార్టీ నేతలు వెళ్ళింది అని అంటున్నారు. మీడియా ముందుకు వచ్చే నేతలు ఏపీలో జరిగే అభివృద్ధిని సంక్షేమాన్ని పదే పదే చెప్పాలని కూడా సూచనలు వెళ్ళాయట. చేసుకున్న అభివృద్ధిని చెప్పుకోకుండా ఈ చర్చలతో వచ్చే లాభమేంటి అన్నదే కూటమి పెద్దలకు పట్టుకుంది అని అంటున్నారు. అంతే కాదు వారు అరెస్ట్ ఖాయమని వీరిని అరెస్ట్ చేస్తామని చెబుతూ సవాల్ చేయడం వల్ల జనంలో అవే ఎక్కువగా పోతున్నాయని ఫలితంగా దీని వల్ల నెగిటివిటీ పెరుగుతుంది తప్ప ప్రయోజనం ఉండదని భావిస్తున్నారుట. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది కాబట్టి పార్టీలోని పెద్దలు కీలక నేతలు ప్రభుత్వం చేసిన మంచి పనుల మీదనే ఫోకస్ పెడుతూ జనంలోకి వెళ్ళాలని డైరేక్షన్స్ వెళ్ళాయని అంటున్నారు.