ప్రజలకు నగదు రూపంలో ఇచ్చే పథకాలకు దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. ఒకరిని మించి మరొకరు ఈ పథకాలను అమలు చేస్తున్నారు. అయితే.. ఈ పథకాలతో నిజంగానే ప్రజలు సంతసిస్తున్నారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయానికి ప్రజల మూడ్ మారుతోంది. ఎన్ని పథకాలు అమలు చేసినా.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసి.. మేం అదిచ్చాం.. ఇదిచ్చాం అని చెప్పుకొన్న వారు.. బుట్ట దాఖలైన పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.
ఏపీలో వైసీపీ అధినేత జగన్.. తాము నవరత్నాలను అమలు చేసి.. ప్రజలను బాగుచేశామని చెప్పుకొన్నారు. కానీ, ఇదేసమయంలో క్షేత్రస్థాయి సమస్యలను ఆయన లైట్ తీసుకున్నారు. ఫలితంగా పార్టీని ప్రజలు బుట్టదాఖలు చేసి.. 11 స్థానాలకు పరిమితం చేశారు. రహదారుల నిర్మాణాన్ని గాలికి వదిలేశారు. ప్రజల ఆకాంక్షలను, డిమాండ్లను పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలను వదిలేశారు. ఇవన్నీ.. వైసీపీ ఇచ్చిన సొమ్ముల ముందు..దూదిపింజల్లా ఎగిరిపోయి.. అధికారం నుంచి దింపేశాయి.
ఇప్పుడు కూడా అదే జరుగుతోందా? అంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి.. అదేనని అంటున్నా రు.. పరిశీలకులు. అయితే.. అప్పటికి ఇప్పటి కొంత తేడా ఉంది. ఏదైనా తేడా కొడుతోందని తెలిసినా.. వినిపించుకో కుండా.. తన మానాన తను వ్యవహరించారు.. అప్పటి సీఎం జగన్. కానీ, ఇప్పుడు సీఎం చంద్రబాబు.. తేడా వస్తోందని భావిస్తే.. మార్పు దిశగా ఆలోచన చేసి.. అవసరమైతే.. వెనక్కితగ్గే తత్వం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు ప్రజల సంతృప్తిపై మరో సారి దృష్టి పెట్టారు.
అనేక రూపాల్లో ప్రజలకు ఆర్థిక లబ్ధి చూకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే అప్పులు చేసి మరీ సూపర్ సిక్స్‌ను అమలు చేస్తున్నారన్నది వాస్తవం. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. సూపర్ సిక్స్ అమలు చేసినా.. సుదీర్ఘ కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించడం లేదన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. తాజాగా ఇద్దరు మహిళా మంత్రులకు కూడా పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అంతర్మథనంలో పడ్డారు. పథకాలు ఇవ్వడంతోనే కాదు.. సమస్యలు కూడా పట్టించుకునేదిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ మార్పు ఏమేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.