ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం కోసం తాము ఇంకా ఎన్నాళ్లు పోరాడాలని ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉందని వ్యాఖ్యానించిన షర్మిల.. ఈ కేసులో జగన్ కోసం ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థ సీబీఐ గొంతు నొక్కేస్తోందని ఆరోపించారు. వివేకా కేసును పునర్విచారించాలని డిమాండ్ చేసిన షర్మిల, అసలు దోషులను గుర్తించకుండా దర్యాప్తు ముగిసిందని సీబీఐ ప్రకటించడంపై మండిపడ్డారు.
వివేకానంద రెడ్డి హత్య కేసుపై విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడారు. వివేకా హత్య విషయంలో మళ్లీ దర్యాప్తు చేపట్టకపోవడాన్ని నిలదీశారు. వై నాట్ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షర్మిల.. ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నా న్యాయం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు జగన్ అడ్డుపడుతున్నాడని షర్మిల ఆరోపించారు. హత్య జరిగిన సమయంలో అవినాశ్ రెడ్డి అక్కడే ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లొకేషన్లు ఉన్నాయని షర్మిల ఆరోపించారు.
జగన్ ప్రధాని మోదీకి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ చేతిలో సీబీఐ కీలుబొమ్మ. జగన్ కోసం సీబీఐ గొంతునొక్కారంటూ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కోసమే నిందితుడు అవినాశ్ రెడ్డిని కాపాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. నిజంగా సీబీఐ అనుకుంటే దోషులకు ఎపుడో శిక్ష పడేదని చెప్పారు. వివేకా హత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని.. గూగుల్ మ్యాప్ లొకేషన్లు కూడా ఉన్నాయని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఉన్నాడని.. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని షర్మిల తెలిపారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. న్యాయం ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారామె. సీబీఐ విచారణ సరిగా లేదంటూ సునీత చేసిన ఆరోపణలు నిజముందన్నారు.
షర్మిల వ్యాఖ్యలతో వివేకా హత్య కేసు మరోమారు చర్చనీయాంశమైంది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు. కడప జైల్లో అప్రూవర్ దస్తగిరిని బెదిరించిన కేసుపై తాజాగా విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం తన వైపు నుంచి వివేకాకు న్యాయం చేయడానికి పావులు కదుపుతోందని అంటున్నారు. నిందితుల్లో ఒకరైన వైసీపీ నేత శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరిట జైలుకు వెళ్లి దస్తగిరిని బెదిరించినట్లు కేసు నమోదైంది. దీనిపై తాజాగా నిజానిజాలు నిగ్గుతేల్చాలని ప్రభుత్వం పావులు కదుపుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో వైఎస్ సునీత దంపతులతోపాటు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పోలీసు కేసులు నమోదయ్యాయి. దీన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సందర్భంలో హత్య కేసును త్వరలో తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో షర్మిల బయటకు వచ్చి చిన్నాన్న హత్యలో తమకు న్యాయం జరగడం లేదని, సొంత సోదరుడిపైనే విమర్శలు చేయడం గమనార్హం.