ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే సాంకేతికతకు పెద్దపీట వేస్తారన్న పేరుంది. పాలనలోనూ.. పార్టీలోనూ ఆయన ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఏ విషయాన్నయినా ఆయన ఐటీకి ముడిపెడుతుంటారు. ఇలా నే తాజాగా తన పాలనను మరింతగా ఐటీతో ముడిపెట్టేందుకు రెడీ అయ్యారు. క్వాంటం కంప్యూటర్స్ ద్వారా మరింతగా పాలనను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఇది పాలన పరంగా సక్సెస్ అయినా.. ప్రజల వరకు ఎంత వరకు ఇది.. సంతృప్తి ఇస్తుందన్నది చూడాలి.
ఇంతగా ఐటీని నమ్ముకుని ముందుకు సాగుతూ.. విజన్ 2047 మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ.. చంద్రబాబు సహా ప్రభుత్వానికి జగన్ బెంగ పట్టుకుందన్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణం.. జగన్ మాస్ ఇమేజ్. దీనిని తగ్గించేందుకు సూపర్ సిక్స్ ను ఆయుధంగా చేసుకోవాలని చంద్రబాబు భావించారు. అందుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆయన ఈ పథకాలను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ.. జగన్ మాస్ ఇండెక్స్ ముందు.. చంద్రబాబుమాస్ ఇండెక్స్ పుంజుకోలేకపోతోందన్నది వాస్తవం.
చంద్రబాబు తరచుగా తన పనితీరును తాను అంచనా వేసుకుంటారు. ఈ క్రమంలో మాస్ ఇండెక్స్‌ను కొలుచుకున్నప్పుడు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మాస్ జనాభాలో చంద్రబాబు పట్ల సంతృప్తి 25 శాతం కూడా దాటలేదన్నది సీఎంవో వర్గాలు చెబుతున్నమాట. ఇదేసమయంలో జగన్ మాస్ ఇమేజ్ పుంజుకుంది. అయితే.. పవన్ కల్యాణ్ రూపంలో చంద్రబాబుకు ఈ మాస్ ఇమేజ్ కలిసి వస్తోంది. ఇదే కూటమి కలిసి ఉండేందుకు ప్రధానంగా దండలో దారంగా మారిందన్న వాదన కూడా ఉంది.
ఈ పరిణామాలను అంచనా వేసుకున్న చంద్రబాబు.. విజన్‌తో పాటు మాస్‌కు చేరువ కావాలన్న ప్రయ త్నాలు.. మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఇటీవల ఆయన రైతుల పక్షపాతినని తనను తాను ప్రొజెక్టు చేసుకునే వ్యాఖ్యలు చేశారు. అయితే.. క్షేత్రస్థాయిలో తమ సమస్యలు పరిష్కరించుకుండా .. మాటలకే పరిమితం కావడం పట్ల అన్నదాతలు.. ఒకింత ఫీలవుతున్నారన్నది వాస్తవం. అదేసమయం లో ఇతర మాస్ జనాలు కూడా చంద్రబాబును పెద్దగా ఓన్ చేసుకోలేక పోతున్నారు. దీనిని అధిగమించేం దుకు ఇప్పుడున్న మార్గం.. అన్న క్యాంటీన్లను మరింత బలోపేతం చేయడం. దీనిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. మాస్ ఇండెక్స్‌లో జగన్ దూకుడు కలవరపెడుతున్న మాట వాస్తవమేనని పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు.