టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి… ఇంకా ఎంత కాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతాడో తెలియదు.. ఆరు నెలల కిందటి వరకు ఈ మాట ఎవరన్నా అంటే నమ్మకపోయేవారేమో..? కానీ, ఇప్పుడు మాత్రం ఈ సిరీస్ ఆఖరా? వచ్చే సిరీస్ ఆఖరా? అన్నట్లుంది పరిస్థితి. అనూహ్యంగా ఈ ఏడాది మే చివర్లో టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు కోహ్లి కొనసాగుతున్నది.. అప్పుడో ఇప్పుడో ఒకటీ అరా తప్ప మ్యాచ్ లు జరగని వన్డే ఫార్మాట్ లో మాత్రమే.
వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లి కింగ్ అని చెప్పొచ్చు. 2008లో శ్రీలంకపై వన్డే మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాడు కోహ్లి. 17 ఏళ్ల కెరీర్ లో 302 మ్యాచ్ లు ఆడిన విరాట్.. 290 ఇన్నింగ్స్ లో 14,181 పరుగులు చేశాడు. సగటు 57.88. అత్యధిక స్కోరు 183. ఇక వన్డేల్లో 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు కొట్టాడు. వాస్తవానికి వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్ లు ఆడి 18,426 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 200 (నాటౌట్). సగటు 44.83. ఇక సెంచరీల విషయానికి వస్తే 49 సార్లు మూడంకెలు దాటాడు.
-సచిన్ టెండూల్కర్ టెస్టు రికార్డులు మరీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. అత్యధికంగా 200 మ్యాచ్ లు ఆడిన సచిన్ 329 ఇన్నింగ్స్ లో 15,921 పరుగులు చేశాడు. సగటు 53.79. 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేలు, టెస్టుల్లో మొత్తం 100 సెంచరీలు చేసిన ఘనత సచిన్ ది.
సచిన్ ను వన్డేల్లో, టెస్టుల్లో పరుగుల పరంగా అధిగమించే అవకాశం కోహ్లికి లేదు. మరొక్క 20 రోజుల్లో 37 ఏళ్లు పూర్తి చేసుకోనున్న కోహ్లి.. ఒక్క విషయంలో మాత్రం సచిన్ ను మించొచ్చు. అదే సెంచరీల సంఖ్య. సరిగ్గా రెండేళ్ల కిందట వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ పై కోహ్లి 50వ వన్డే సెంచరీ కొట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ పై చాంపియన్స్ ట్రోఫీలో 51వ సెంచరీ సాధించాడు.
ఆస్ట్రేలియాతో ఆదివారం (అక్టోబరు 19) జరిగే వన్డేలో కోహ్లి గనుక సెంచరీ కొడితే అతడికి 52వ వన్డే సెంచరీగా మారుతుంది. ఈ మ్యాచ్ లో కాకున్నా.. తర్వాతి రెండు మ్యాచ్ లలో సెంచరీ కొట్టే చాన్సుంది. అదే జరిగితే ఒకే ఫార్మాట్ (వన్డే)లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మన్ గా కోహ్లి పేరు రికార్డుల్లో నిలుస్తుంది. రికార్డుల కోసం కాకున్నా ఇప్పుడు సెంచరీ కొట్టడం కోహ్లికి అత్యవసరం కూడా. ఎందుకంటే.. వన్డే కెరీర్ ను 2027 ప్రపంచకప్ వరకు పొడిగించుకునేందుకు…!