విజయసాయిరెడ్డి. వైసీపీలో ఉన్నపుడు నంబర్ టూ గా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత తనను పూర్తిగా పక్కకు పెట్టారని ఆయన అసంతృప్తి చెందిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది వస్తూనే వైసీపీని ఆయన తనకు తానుగా వదిలించేసుకున్నారు. ఏకంగా పార్టీకి పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ పదవికి, ఆ మీదట ఎందుకొచ్చిన ఈ రాజకీయం అంటూ పాలిటిక్స్ కూడా రాజీనామా ప్రకటించేశారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటాను, ఎందుకొచ్చిన పాలిటిక్స్ అంటూ కూడా ఆయన ట్వీట్లు పెడుతూ వచ్చారు. అగ్రికల్చర్ ఈజ్ మై కల్చర్ అని కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొత్తానికి చూస్తూండగానే వైసీపీ మాజీ నేతగా విజయసాయిరెడ్డి దాదాపుగా పది నెలల కాలం గడిపేశారు. ఈ మధ్యలో చూస్తే ఆయన గురించి చర్చ కూడా సోషల్ మీడియాలో లేదు, ఆయన కూడా గతంలో మారిదిగా తన ట్విట్టర్ హ్యాండిల్ కి పెద్దగా పనిచెప్పడం లేదు అని అంటున్నారు.
ఇక విజయసాయిరెడ్డి గురించి లేటెస్ట్ గా ఒక ప్రచారం అయితే వైరల్ అవుతోంది. ఆయన మళ్ళీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ మేరకు తన ఆలోచనలను సన్నిహిత మిత్రులతో పంచుకున్నారని అంటున్నారు. తాను తొందరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాను అని వారికి చెప్పినట్లుగా కూడా అంటున్నారు. అంటే విజయసాయిరెడ్డి వ్యవసాయం కాదు ఇక చేసేది మళ్ళీ రాజకీయ వ్యవసాయమే అని అంటున్నారు. విజయసాయిరెడ్డి అంటేనే ఒక బ్రాండ్ అన్నట్లుగా వైసీపీలో ఉన్నపుడు పాలిటిక్స్ ని దూకుడుగా చేసేవారు. సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్ధులకు ఎవరికి ఎంత ఎక్కడ ఇవ్వాలో ఇచ్చేశారు. మరి అలాంటి ఆయన ఖాళీగా ఇన్ని నెలకు కూర్చోవడమే ఒక వింతా విశేషం. దాంతో ఆయన మనసు రాజకీయాల వైపు మళ్ళింది అంటే అందులో ఆశ్చర్యం లేదు కానీ ఆయన పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరుతారు, ఏమిటి అన్నది వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గా ఉంది అని అంటున్నారు.
విజయసాయిరెడ్డి రాజకీయంగా ప్రవేశం ఇచ్చిందే వైసీపీ ద్వారా. ఆయనకు వైఎస్సార్ కుటుంబంలో మూడు తరాలుగా పరిచయాలు ఉన్నా ప్రత్యక్ష రాజకీయాలు మాత్రం ఫ్యాన్ పార్టీ ద్వారానే జరిగాయి. అయితే ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తారా అన్నది చర్చ. కానీ అలా జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి తానుగా వైసీపీని వీడిపోయారని అంటున్నారు. పైగా వైసీపీ మీద లిక్కర్ స్కాం దెబ్బ పడడానికి ఆయన కూడా ఎంతో కొంత లీకులు ఇచ్చిన చేసినది ఉందన్న భావన అధినాయకత్వంలో ఉందని అంటున్నారు. అంతే కాదు జగన్ విషయం తీసుకుంటే ఒకసారి వైసీపీ నుంచి వీడిన నేతలను ఎంత బడా నేతలు అయినా తిరిగి చేర్చుకునేది మాత్రం బహు తక్కువ దాదాపుగా అరుదు అని చెబుతారు. దాంతో వైసీపీలో అయితే ఆయన చేరే చాన్స్ లేదని అంటున్నారు.
ఇక మరో ప్రశ్న ఉంది. కూటమి వైపు విజయసాయిరెడ్డి వెళ్తారా అన్నది. కూటమిలో ముందుగా చెప్పుకునేది బీజేపీ గురించి. అసలు విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు. ఆయన వైసీపీని వీడారు అంటే కాషాయం కండువా కప్పుకోవడానికే అని కూడా ప్రచారం సాగింది. కానీ అదేమీ జరగలేదు, సో బీజేపీలో ఆయన చేరేది లేదు అని తేలిపోయింది అని అంటున్నారు. ఇక టీడీపీ విషయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి పదేళ్ళ ప్రత్యక్ష రాజకీయ పోరాటం అంతా వైసీపీ వైపు నుంచి టీడీపీ మీదనే సాగింది. దాంతో చేర్చుకోరని అంటున్నారు. జనసేన ఆప్షన్ ఉన్నా ఆ పార్టీలో కూడా చేరేది ఉండదని వారు కూడా కూటమి ధర్మం ప్రకారం ఆలోచిస్తారని అంటున్నారు. ఇలా అన్నీ కలిపి కూడితే ఒకే ఒక్క పార్టీ అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.
విజయసాయిరెడ్డి వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేస్తే టీటీడీ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు. అంతే కాదు కాంగ్రెస్ నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు వైఎస్సార్ కుమార్తె షర్మిలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆయన వైసీపీని వీడక ఆమె ఇంటికి వెళ్ళి చాలా సేపు ముచ్చటించిన ఉదంతం కూడా అప్పట్లో చర్చగా ఉంది. దాంతో ఆయన మంచి రోజు చూసుకుని కాంగ్రెస్ లో చేరుతారు అని అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి గెలిస్తే కనుక ఏపీ నుంచి చేరే పొలిటికల్ బిగ్ లీడర్ గా విజయసాయిరెడ్డి పేరే మొదటిగా ఉంటుంది అంటున్నారు. పీసీసీ చీఫ్ గా షర్మిలకు తోడుగా ఉంటూ ఏపీలో కాంగ్రెస్ లో కీలకంగా విజయసాయిరెడ్డి మారుతారు అని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.