వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి (Former MP Vijayasai Reddy) గైర్హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల ఈరోజు విచారణకు రాలేకపోతున్నట్లు సిట్‌కు సమాచారం పంపారు. ఎప్పుడు వస్తానో మళ్లీ సమాచారం ఇస్తానని సిట్ అధికారులకు కబురు పంపించారు. ఈ కేసుకు సంబంధించి రేపు (ఏప్రిల్ 18)న విచారణకు రావాల్సిందిగా విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అందుకే ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు విచారణకు వస్తానని సిట్ అధికారులకు సాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. అందుకు సిట్ అధికారులు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రాలేనని, మళ్లీ మరోసారి వస్తానని విజయసారెడ్డి చెప్పడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది.
మద్యం స్కాంపై సిట్ విచారణతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో ఉన్న వైసీపీకి గొప్ప ఊరట దక్కింది. లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియా అంటూ వైసీపీ నేత, మాజీ సీఎం జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఇరికించేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి మనసు మార్చుకున్నారా? అనే చర్చ మొదలైంది. గురువారం సిట్ విచారణకు హాజరుకావాల్సిన విజయసాయిరెడ్డి.. ఈ రోజు తాను అందుబాటులో ఉండటం లేదని చివరి నిమిషంలో వర్తమానం పంపారు. దీంతో ఏ బాంబు పేల్చుతారోనని విజయసాయిరెడ్డి వెంట పడిన వారు చివరికి తుస్ మన్నారు.
మద్యం స్కాంపై విచారణలో భాగంగా 18వ తేదీ శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండు రోజుల కిందట వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తనకు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఒక రోజు ముందు విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి కోరడంతో అందుకు సిట్ అధికారులు కూడా అంగీకరించారు. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన విధంగానే ఈ రోజు ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయమైన విజయవాడ కమిషనరేట్ కు విజయసాయి రావాల్సివుంది. 17న వస్తానని ఆయనే స్వయంగా చెప్పడంతో సీనియర్ పోలీసు అధికారుల కూడా ఆయన కోసం ఎదురుచూశారు. అయితే విచారణ మొదలవ్వాల్సిన సమయంలో తాను ఈ రోజు రావడం లేదని విజయసాయిరెడ్డి నుంచి పోలీసులకు వర్తమానం అందిందని అంటున్నారు. దీంతో విజయసాయిరెడ్డి వాంగ్మూలంపై ఆశలు పెట్టుకున్న పోలీసులు షాక్ తిన్నారని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి విజయసాయిరెడ్డి వ్యవహారం తెలిసిన వారు ఎవరైనా.. ఆయనను అంత సులువుగా నమ్మరని అంటుంటారు. బయటకు చెప్పేది ఒకటైతే, ఆయన చేసే పని వేరుగా ఉంటుందని విమర్శలు ఉన్నాయి. అయితే గత నెలలో కాకినాడ సీపోర్టు కేసులో సీఐడీ విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి.. అప్పట్లో మీడియా ముందు స్వచ్ఛందంగా లిక్కర్ స్కాంపై కామెంట్లు చేశారు. దీంతో వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు ఆయన వాంగ్మూలం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇక అదే సమయంలో లిక్కర్ స్కాంపై తనను అడిగితే చాలా విషయాలు చెబుతానని విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆయన ఏం చెబుతారనేది ఉత్కంఠ రేపింది.
విజయసాయిరెడ్డి విచారణపై రాష్ట్రవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. విజయసాయిరెడ్డి నోరు విప్పి వైసీపీలో ఎవరిని ముంచేస్తారోనని ఆ పార్టీలో కిందస్థాయి నుంచి అధిష్టానం వరకు అంతా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. అయితే ఏం జరిగిందో? ఏమో విజయసాయిరెడ్డి సిట్ విచారణకు డుమ్మాకొట్టి వైసీపీకి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. వైసీపీ పెద్దలను ఇబ్బంది పెట్టేలా మాట్లాడొద్దని ఆయనకు ఎవరైనా చెప్పారా? లేక ఇతర పనుల వల్ల ఆయన ఈ రోజు సిట్ విచారణకు హాజరుకాలేకపోయారో? తేలాల్సివుంది. ఏదిఏమైనా విజయసాయిరెడ్డి గైర్హాజరుతో వైసీపీ కాస్త ఊపిరి పీల్చుకుందని అంటున్నారు