విద్యాబాలన్. పలు సినిమాల్లో నటించి అన్ని భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విద్యాబాలన్. 2003లో ఓ బెంగాలీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన విద్యా బాలన్, 2005లో పరిణిత అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ సినిమా విద్యా బాలన్ కు హీరోయిన్ గా మంచి పేరును తెచ్చిపెట్టింది.
ది డర్టీ పిక్చర్ తర్వాత పలు మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించిన విద్యాబాలన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మోహన్ లాల్ తో ఆమె చేయాల్సిన చక్రం సినిమా మధ్యలో ఆగిపోవడంతో రాత్రికి రాత్రే తన జీవితం మొత్తం మారిపోయిందని, ఆ సినిమా ఆగిపోవడంతో తనపై ఐరెన్ లెగ్ అనే స్టాంప్ కూడా పడిందని విద్యా బాలన్ అన్నారు.
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి నటించడానికి తాను చక్రం అనే సినిమాకు సైన్ చేశానని, కొన్నాళ్ల పాటూ ఆ సినిమా షూటింగ్ కూడా జరిగి, ఆడియన్స్ లోకి వెళ్లిందని, కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమా ఆగిపోయిందని, దీంతో సినిమా ఆగిపోవడానికి కారణం తానే అని ప్రచారం జరిగిందని, తనను ఐరెన్ లెగ్ అని కూడా అన్నట్టు విద్యా బాలన్ చెప్పారు. దీంతో రాత్రికి రాత్రే తాను ఆల్రెడీ సైన్ చేసిన 9 సౌత్ సినిమాల నుంచి తనను తొలగించి తన జీవితాన్నే మార్చేశారని, అసలు ఆ ప్రాజెక్టు ఆగిపోవడానికీ తనకీ ఎలాంటి సంబంధం లేదని, డైరెక్టర్‌కీ హీరోకీ మధ్య వచ్చిన మనస్పర్థల వల్లే ఆ సినిమా ఆగిపోయిందని, అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ తన కెరీర్ మీద మాత్రమే పడిందని ఆమె తెలిపారు. అయితే ఆఫర్లు చేజారినా ఎప్పుడూ తను వెనుకడుగేయలేదని, మొదట్లో అమితాబ్, టబు లాంటి నటీనటులకు కూడా రిజెక్షన్ ఎదురైందని గుర్తు చేసుకుని ముందడుగేశానని, తనపై తనకున్న నమ్మకమే తనను ఇవాళ ఈ పొజిషన్ కు చేర్చిందని విద్యాబాలన్ వెల్లడించారు. ఆ తర్వాత విద్యా బాలన్ మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులు, పురస్కారాలను కూడా అందుకున్నారు.