అధిక బరువు తగ్గడం కోసం నటీమణులు పడే కష్టం అంతా ఇంతా కాదు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. తిండి కట్టేసి చాలా నియమనిష్ఠలతో ప్రయత్నిస్తున్నారు. ఒజెంపిక్ తీసుకుని బరువు తగ్గారని విమర్శల్ని ఎదుర్కొన్న కరణ్ జోహార్- బోనీకపూర్ ల జాబితాలో వీళ్లు లేరు. ఇప్పుడు ప్రముఖ హిందీ నటి విద్యాబాలన్ తన అధిక బరువు సమస్య గురించి, బరువు హెచ్చు తగ్గుల కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.
తాను ప్రతిసారీ బరువు తగ్గినా తిరిగి కొంతకాలానికి యథాతథ స్థితికి పెరగడంపై కలత చెందేదానిని అని విద్యాబాలన్ పేర్కొన్నారు. అయితే పెరిగిన బరువుతోనే నటిగా తన ప్రయత్నాలు తాను కొనసాగించానని, లీడ్ పాత్రల్లో కొనసాగానని విద్యా చెప్పారు. నేను సిగ్గు లేని ఆశావాదిని… నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది. నేను వెనుకబడిపోకుండా నా గొప్పతనాన్ని నేను ప్రదర్శించాను! అని బాలన్ తెలిపారు. చుట్టూ ఉన్న జనాలు బరువు తగ్గాలని సూచించినా కానీ, నాలో ఏ తప్పు లేదని భావించానని విద్యా అన్నారు.
నేను ఎప్పుడూ లీడ్ పాత్రలను వదిలిపెట్టలేదు.. నాలో అభద్రతా భావం లేనే లేదు! అని తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసారు విద్యా బాలన్. జీవితాంతం సన్నగా ఉండటానికి ప్రయత్నించాను. కఠినమైన ఆహార, వ్యాయామ నియమాలు అనుసరించాను.. కొన్నిసార్లు బరువు తగ్గినా తిరిగి యథాస్థితికి వచ్చేదానిని అని తెలిపారు. ఆకు కూరలు, కూరగాయలు తిన్నాను. జీవితాంతం శాఖాహారిని. అయితే అన్ని కూరగాయలు అందరికీ సూట్ కావు. కొన్నిటిని ఎంపిక చేసుకుని తినాలని కూడా బాలన్ వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో నటించిన బాలన్, తెలుగమ్మాయి, పాపులర్ నటి సిల్కుస్మిత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ది డర్టీ పిక్చర్ పేరుతో విడుదలైన ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసింది.