చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జిగా తిరిగి నియమతులైన మాజీ మంత్రి విడుదల రజిని వ్యవహారం వైసీపీలో మరోసారి వివాదానికి, రాజకీయ చర్చకు కూడా దారి తీసింది. ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం తీవ్రస్థాయిలో ఇటీవల ఉద్యమాన్ని నిర్మించింది. రెండు రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో వందలాదిమంది నాయకులు కార్యకర్తలు పాల్గొని రజనీకి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. రజనీ వల్ల పార్టీ నాశనం అయిందని, నాయకులు దూరమయ్యారని, కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించారని వాపోయారు.
నియోజకవర్గం ఇంచార్జ్‌గా రజనీని తప్పించాలని ప్రధాన డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన విడుదల రజని చిలకలూరిపేట నుంచి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఈ సమయంలో తనను విభేదించిన వారితోను, తనను వ్యతిరేకించిన వారితోను కక్ష కట్టినట్టు వ్యవహరించారని పార్టీలోని సొంత నాయకులే చెబుతున్న మాట. ఆమె తీసుకున్న నిర్ణయాలు లేదా కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించారని కూడా వారు ఆరోపిస్తున్నారు.
ఆ కేసుల నుంచి ఇప్పటికి బయటపడలేదని చాలా మంది నాయకులు ఆవేదనతో ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ఆమెకే పగ్గాలు అప్పగించడం వల్ల తాము పార్టీకి పనిచేయలేమని.. పార్టీలో సులభంగా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండదని కూడా వారు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విడుదల రజని అక్కడ ఓడిపోయారు. అనంతరం మళ్లీ తిరిగి తన పాత నియోజకవర్గమైన చిలకలూరిపేటకు వచ్చేశారు. ఆ వెంటనే పార్టీ అధినేత కూడా దీనికి పచ్చ జెండా ఊపారు.
అయితే, ఈ పరిణామాన్ని వైసీపీలోని రజనీ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పార్టీ అన్ని విధాల నష్టపోయిందని మర్రి రాజశేఖర్ ను వదులుకొని పార్టీ తీరని నష్టాన్ని కొనితెచ్చుకుందని నాయకులు ఆరోపిస్తున్నారు. మర్రి రాజశేఖర్ ఒకప్పుడు వైసీపీకి బలంగా నిలబడ్డారు. కానీ, ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇట్లాంటి సమయంలో మరింత బలమైన నాయకుడిని, టిడిపిని బలంగా ఎదుర్కొనే నేతను ఎంపిక చేయాలనేది స్థానికంగా జరుగుతున్న డిమాండ్.
దీనిపై పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. అంటే రజినీనే ఇక్కడ ఇన్చార్జిగా ఉండాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కానీ దీనిని మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తుండడం రజనీ చేసిన తప్పులను బయట పెడుతుండడంతో ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా రజనీకి కూడా ఇబ్బందికర పరిణామాలు నెలకొన్నాయి. సాధ్యమైనంత వేగంగా దీనిని పరిష్కరించాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. మరి దీనిపై దృష్టి పెడతారా లేక రజనీని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.