అనూహ్యంగా వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో సీనియర్లను సైతం పక్కన పెట్టి సీటుని తీసుకున్న విడదల రజనీ అంతే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కీలకమైన శాఖనే ఆమెకు అప్పగించారు. అయితే రెండేళ్ళ మంత్రిగా కానీ అయిదేళ్ళ ఎమ్మెల్యేగా కానీ ఆమె చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వర్గ పోరు కూడా హెచ్చింది. దాంతో యాంటీ గ్రూప్ ఒత్తిడి నేపధ్యంలో 2024 ఎన్నికల సమయంలో ఆమెను గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేశారు. సీటు ఎక్కడైనా ఫేట్ మారలేదు, ఓటమి ఆమెకు సంభవించింది.
అయితే ఓటమి తరువాత ఆమె చేసుకున్న ప్రయత్నాల వల్ల తిరిగి చిలకలూరిపేటకు వచ్చారు. వైసీపీ ఇంచార్జిగా ఆమె అక్కడ పనిచేస్తున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు అంతా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇక వైసీపీని చిలకలూరిపేటలో ఏ మేరకు పెంచారు అన్న దాని మీద అయితే విడదల రజనీ పనితీరుని హైకమాండ్ అంచనా వేసే పనిలో ఉంది అని అంటున్నారు. కానీ ఆమె ఇంచార్జిగా ఉన్నా అక్కడ పార్టీ అయితే పెద్దగా ఎదిగింది లేదని పెద్దలు భావిస్తున్నారుట. ఆమెనే కొనసాగిస్తే మరోమారు వైసీపీకి చేదు ఫలితాలు వస్తాయని ఊహిస్తున్నారుట.
ఇక చిలకలూరిపేటలో చూసుకుంటే టీడీపీకి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రూపంలో బలమైన నాయకత్వం ఉంది. అంతే కాదు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఫుల్ ఫోకస్ పెట్టేశారు. రజనీ మంత్రిగా ఉన్న కాలంలో ఆమె అనుచరులు దందాలు చేశారు అని ఫిర్యాదులు ఇలా అనేక ఇబ్బందులు ఉన్న నేపధ్యంలో రజనీని అక్కడ నుంచి వేరే సీటుకు షిఫ్ట్ చేయాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. దాంతో రజనీకి ఈ వర్తమానం తెలిసిందని ఆమెతో పాటు అనుచరులు కూడా ఇదే విషయం మీద మధనపడుతున్నారు అని అంటున్నారు.
రజనీని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న మరో కీలక నియోజకవర్గం రేపల్లెకు వెళ్ళమని అధినాయకత్వం పురమాయిస్తోంది అని అంటున్నారు. అక్కడ కూడా వైసీపీకి వీక్ లీడర్ షిప్ ఉందని అంటున్నారు. ఈవూరు గణేష్ అనే ఆయన అక్కడ పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. ఇక చూస్తే మాజీ మంత్రి మాజీ ఎంపీ అయిన సీనియర్ నేత అక్కడ నుంచి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళిపోవడంతో రేపల్లె తల్లడిల్లుతోంది. దాంతో పాటుగా అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అనగాని సత్యప్రసాద్ రెవిన్యూ మంత్రిగా ప్రస్తుతం కీలకంగా ఉన్నారు.
దాంతో రేపల్లె అంటే వైసీపీకి టఫ్ టాస్క్ గా ఉంది. దాంతో అక్కడికి రజనీని పంపిస్తున్నారు అని పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాటగా ఉంది. ఇక రేపల్లె కూడా బీసీలకు పెట్టని కోట లాంటి సీటే. ఇక రజనీ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి ఆమె దూకుడుగా రాజకీయం చేస్తే రేపల్లె వైసీపీకి ఒక ఆశాకిరణంగా మారుతుందని భావిస్తున్నారుట. కానీ అక్కడికి షిఫ్ట్ కావడానికి రజనీ అయితే అంగీకరించడం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ షిఫ్టింగులతో రజనీ వర్గం అయితే అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
















